తెలంగాణ అభివృద్ధి కోసమే సోనియా త్యాగం
ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత ఆమెదే: కాంగ్రెస్
మెదక్,అక్టోబర్23(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భావనతోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని కానుకగా ఇచ్చారని,అయితే మాయ మాటలతోటే నాలుగేళ్ల పాటు సొంత జమానాలో కెసిఆర్ మునిగిపోయారని మెదక్ మాజీ ఎమ్మెల్యే,పిసిసి అధికార ప్రతినిధి ఎ.శశిధర్ రెడ్డి అన్నారు. రైతుల పరిస్థితులను పట్టించుకోని ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తుందన్నారు. ఇలాంటి వారిని మరోమారు ఎన్నుకుందామా అననది ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఫలానా సమస్యను పరిష్కరించారన్న భరోసా ఇవ్వని వారు టిఆర్‌ఎస్ నేతలన్నారు. ప్రజలకు దూరంగా ఉండే నేతను వదిలించుకుందామని ఆయన తన ప్రచారంలో పిలుపునిచ్చారు. విద్యార్థుల బలిదానాలకు చలించిన సోనియా ప్రకటించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగించడం దారుణమన్నారు. పేద విద్యార్థులను ఇబ్బందుల పాల్జేసిన ప్రభుత్వాలు తుడిచిపెట్టుకు పోయాయని అన్నారు. జిల్లాల ఆవిర్భావం తర్వాత ఆశించిన ఫలితాన్ని సాధించలేదన్నారు. ప్రధానంగా రైతులు, విద్యార్థుల సమస్యలపై సర్కార్ నిర్లక్ష్యం కొనసాగుతోందన్నారు. తెరాస సర్కారు అన్ని వర్గాలను మోసం చేస్తోందని వ్యాఖ్యానించారు. రైతులు, విద్యార్థులు, యువకుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా వచ్చిన నిధులను తెరాస అధికారంలోకి వచ్చాక ఎవరికి ఏం లాభం జరిగిందంటూ ప్రశ్నించారు. సొంత పనులకు ఖర్చులు పెడుతూ రైతులకు మేలు చేయడానికి అంటున్నారని ధ్వజమెత్తారు. రైతు సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. రైతుల గుండె చప్పుడును అర్థం చేసుకునేది ఒక్క కాంగ్రెస్సేనని అన్నారు. ప్రజలకు కావల్సింది సమస్యల పరిష్కారమని పేర్కొన్నారు. విత్తన వ్యాపారులతో కుమ్మక్కైన తెలంగాణ ప్రభుత్వం నకిలీ విత్తులు అంటగట్టి పలువురు అన్నదాతల ఆత్మహత్యలకు కారణమయిందని ఆరోపించారు. ఇలాంటి పార్టీని అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదన్నారు.



