తెలంగాణ ఉద్యమమే ధ్యేయంగా పనిచేస్తా: నాగం జనార్థన్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 24 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమమే ధ్యేయంగా పనిచేస్తానని తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం తెలంగాణ జర్నలిస్ట్‌ల ఫోరం కన్వీనర్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం విద్యార్థులు, యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నా ప్రభుత్వంలో చలనం లేదని పేర్కొన్నారు. ఈనెల 26 నుంచి తెలంగాణ భరోసా యాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సాధించడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని చెప్పారు. తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న బాబు, షర్మిలలు తెలంగాణపై వైఖరి వెల్లడించకుండా దాటవేస్తున్నారని అన్నారు. పార్టీలకతీతంగా తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకోవాలని తెలిపారు. పదవుల కోసం పాకులాడకుండా తెదేపా నుంచి బయటకు వచ్చానని, నాతోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా వచ్చారని గుర్తుచేశారు. తెలంగాణలోని అన్ని పార్టీల నాయకులు అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తేనే తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 26న అచ్చంపేటలో భరోసా యాత్ర ప్రారంభించి, హైద్రాబాద్‌లో ముగిస్తానని తెలంగాణలోని అన్ని జిల్లాల్లో యాత్ర సాగిస్తానని వివరించారు. ఈ నెల 26న ఉదయం 10 గంటలకు అచ్చంపేటలో పాదయాత్ర ప్రారంభిస్తామన్నారు. 12 గంటలకు ఉప్పునుంతల, మధ్యాహ్నం రెండు గంటలకు వంగూరు, 2.30 గంటలకు కల్వకుర్తి, 3.30 గంటలకు మిడ్జిల్, సాయంత్రం ఐదు గంటలకు జడ్చర్లలోని నేతాజీ చౌరస్తా మీదుగా పాదయాత్ర మహబూబ్‌నగర్‌కు చేరుకుంటుందని తెలిపారు. అనంతరం 27న మహబూబ్‌నగర్‌లో 9.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుందని, 11.30గంటలకు హన్వాడ, గండేడు, కోస్గి, కొడంగల్ మీదుగా తాండూరుకు చేరుకుంటుందని వివరించారు. సమావేశంలో పలువురు తెలంగాణ జర్నలిస్ట్ నేతలు, పలువురు జేఏసీల నాయకులు పాల్గొన్నారు.