తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక జేఏసీ

  • కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసింది.
  • టీిఆర్‌ఎస్‌ ఉద్యమం పేరుతో రాజకీయం చేస్తోంది

పరకాల మే, 27(జనం సాక్షి) :
జేఏసీ తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక అని బీజేపీ జాతీయ నాయకులు బండారు దత్తాత్రేయ అన్నారు. పరకాల లోని డాక్టర్‌ సిరంగి సంతోష్‌కుమార్‌ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బీజేపీ జాతీయ నాయకులు బండారు దత్తాత్రేయ, పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బీజేపీ పార్టీ కేంద్రంలో ఇటు రాష్ట్రంలో తెలంగాణపై ఎనలేని పోరాటం చేస్తున్నందున జెఎసి తమ పార్టీ వైపు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మొన్న జరిగిన బహిరంగ సభతో బీజేపీ పార్టీ విజయం సాధించిందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్నాడని కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన తెలంగాణ మంత్రులు, ఎం.పి.లు, ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం చేస్తున్నారని అన్నారు. 2014లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణను వెంటనే ప్రకటిస్తామని అన్నారు. జెఎసి ఎవరికి మద్దతు ఇస్తుందో స్పష్టం చేయాలన్నారు. యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ: దేశ రాజకీయాల్లోనే బీజేపీ పార్టీ అతి ముఖ్యమైనదని తెలంగాణ బీజేపీ ద్వారానే వస్తుందన్నారు. 2001 టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పడినప్పటి నుండి 40 ఉప ఎన్నికలు వచ్చాయని 25 సార్లు టీిఆర్‌ఎస్‌ పార్టీ గెలుపొందిందని గుర్తు చేశారు. పాలమూరులోని బీజేపీ పార్టీ గెలువగానే ఇటు టీఆర్‌ఎస్‌పార్టీ, అటు కాంగ్రెస్‌ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయని అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఉన్న 2 ఎంపీలతో తెలంగాణపై ఢిల్లీలో ఏమి చేయలేరని అన్నారు. కేసీఆర్‌ పార్లమెంటులో తెలంగాణపై ఏం మాట్లాడినా ఏ ఒక్క నాయకులు పట్టించుకోరని అలాంటి వాడు తెలంగాణ ఎలా తెస్తాడని ప్రశ్నించారు. 2009 లో సోనియాగాంధీ కేసీఆర్‌ చెవిలో ఏమి చెప్పిందో ఏమో గాని కాంగ్రెస్‌ నాయకులు ఆ విషయం తెలుసుకొని డ్యాన్సులు చేశారని గుర్తు చేశారు. ఆత్మకూరు సభలో కేసీఆర్‌. మూడు నెలల్లో తెలంగాణ వస్తుందని ప్రజలకు చెప్పడం మూర్ఖత్వం అని అన్నారు. 2004లో టీ.ఆర్‌ఎస్‌ ఎం.ఎల్‌.ఏలు గెల్చి కాంగ్రెస్‌ వాళ్ళకు అమ్ముడు పోయారని గుర్తు చేశారు. డాక్టర్‌ విజయ్‌చందర్‌రెడ్డి మెడికల్‌ జెఎసిలో తెలంగాణపై పోరాటాలు చేస్తూ, ఇటు పేద ప్రజలకు వైద్యం చేస్తూ ఎంతో మేలు చేశారని అలాంటి నాయకుడిని గుర్తించి బీజేపీఅధిష్టానం టిక్కెట్టు ఇచ్చిందన్నారు. పరకాల ప్రజలు బీజేపీపార్టీని బలపర్చి పువ్వు గుర్తుపై ఓటు వేసి డాక్టర్‌ విజయ్‌చందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వనిత, బీజేపీ రాష్ట్ర డాక్టర్‌ సెల్‌ కో కన్వీనర్‌ సిరంగి సంతోష్‌కుమార్‌, బీజేపీమండల నాయకులు కోడెల లింగమూర్తి, మండల ప్రధాన కార్యదర్శి ఆర్‌.పీి.జయంత్‌లాల్‌ తదితరులు పాల్గొన్నారు.