తెలంగాణ ఊసెత్తని టీ-టీడీపీ ఎంపీలు

 

 

ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా టీడీపీ ధర్నా

నీలం తుపాను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

తుపాను బాధిత రైతులను ఆదుకోవాలి: నామా

న్యూఢిల్లీ, నవంబర్‌ 23 :చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ ప్రధాన ద్వారం ఆందోళనకు దిగింది. నీలం తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని, నీలం తుపాను బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా నిర్వహించింది. పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ఎంపీలు రమేశ్‌ రాథోడ్‌, సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ తదితరులు పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. మన్మోహన్‌ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో నీలం తుపాను బాధితులకు తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పార్లమెంట్‌ ఆవరణలో నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. చిన్న వ్యాపారుల పొట్ట కొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరిచిందని విమర్శించారు. ఎఫ్‌డీఐలపై కేంద్రం వెనక్కు తగ్గే వరకూ తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధమంటున్న ప్రభుత్వం.. ఎఫ్‌డీఐలపై 184 నిబంధన కింద చర్చించేందుకు ఎందుకు ముందకు రావడం లేదని ప్రశ్నించారు. ఎఫ్‌డీఐలపై చర్చకు పట్టుబడితే.. చర్చించకుండా పారిపోతోందని ఎద్దేవా చేశారు. ఎఫ్‌డీఐల అంశంపై సోమవారం కూడా సభను స్తంభింపజేస్తామని చెప్పారు. ఎఫ్‌డీఐలపై ప్రభుత్వం దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని నామా ధ్వజమెత్తారు. ఎఫ్‌డీఐల వల్ల రైతులకు ఎలా మేలు జరుగుతుందో పార్లమెంట్‌ సాక్షిగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. చిల్లర వ్యాపారుల పొట్ట కొట్టే ఎఫ్‌డీఐలపై నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు.నీలం తుపాను బాధిత రైతులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. నీలం తుపాను వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి 11 మంది కేంద్ర మంత్రులున్నా రైతులకు న్యాయం చేయలేక పోయారని విమర్శించారు. రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని తాము పార్లమెంట్‌ వద్ద ధర్నా చేస్తుంటే.. మంత్రులు నవ్వుతూ వెళ్లడం రైతులను హేళన చేయడమేనని మండిపడ్డారు. నష్ట పరిహారం చెల్లించే వరకూ కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతామన్నామరు. ఈ అంశంపై సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.