తెలంగాణ కోసం మరో బలిదానం
సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మాహుతి
వరంగల్, జనంసాక్షి :
తెలంగాణ రాదేమోనన్న బెంగతో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండలోని గోపాల్‌పూర్ ప్రాంతానికి చెందిన బస్ కండక్టర్ కుమారుడు ధీరజ్ భరద్వాజ్ (19) ఆత్మకూర్ మండలం గురుకొండలోని వరంగల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్‌లో సివిల్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం కళాశాలకు వచ్చిన ధీరజ్ గేటు వద్దనున్న గోడపై జై తెలంగాణ నినాదాలు, తన తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు రాశాడు. అనంతరం అక్కడున్న విద్యార్థులతో తెలంగాణ గురించి చర్చించాడు. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని వారితో చెప్పాడు. కాంగ్రెస్ నేతల తీరుతో తాను కలత చెందానని వారితో ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం జై తెలంగాణ నినాదాలు చేస్తూ వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను తన ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో ఆందోళన చెందిన విద్యార్థులు మంటలార్పి అతడిని వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. 96 శాతానికి పైగా గాయాలవడంతో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.భరద్వాజ్ మృతికి టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామా చేయాలని కేయూ జేఏసీ డిమాండ్ చేసింది. కాగా, ఈ సంఘటనతో వరంగల్ పట్టణం అట్టుడికింది. కేయూ విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. అనంతరం సుమారు 300 మంది విద్యార్థులు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య ఇంటిని ముట్టడించారు. ఈ క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. ఎమ్మెల్సీ పద్మావతి ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగులగొట్టారు. విద్యార్థుల ఆగ్రహానికి ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి.