తెలంగాణ జనసమితిలో చేరిన యువత

పొత్తులపై ఎవరితోనూ చర్చించలేదన్న కోదండరామ్‌

మంచిర్యాల,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ సమక్షంలో కొంతమంది యువకులు టీజేఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ ఎన్నికలకు సిద్ధమవుతున్నామని, పొత్తులపై ఇంకా ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. పార్టీలో చర్చించిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకతకు ప్రగతి నివేదన సభే నిదర్శనమన్నారు. టీజేఎస్‌ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని కోదండరామ్‌ వ్యాఖ్యానించారు.ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రసంగంలో స్పష్టత లోపించిందన్నారు. ఏం చెప్పదల్చుకున్నారో కూడా చెప్పలేదన్నారు. రాజకీయంగా, ప్రభుత్వ పరంగా కేసీఆర్‌ తన విధానాన్ని చెప్పుకోవడంలో విఫలమయ్యారని ఆచార్య కోదండరాం అన్నారు. సభలో ఏదో ముఖ్యమైన ప్రకటన చేస్తారని ప్రజలు, కార్యకర్తలు ఆశించినా ముఖ్యమంత్రి నిరాశపరిచారన్నారు. నిరంతరం ప్రజలతో సంబంధం ఉన్నవారికి మాత్రమే ప్రజలకు ఏం చెప్పాలో తెలుస్తుందని, కేసీఆర్‌ ఒంటిస్తంభం మేడలో రాజకుమారుడిలా కనిపించారని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి, వస్తు రవాణాకు మాత్రమే వినియోగించాల్సిన ట్రాక్టర్లను ప్రజలను తరలించడానికి వినియోగించినా రవాణా శాఖ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని క్షేత్రస్థాయి నుంచి పార్టీని నిర్మాణం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. నెలాఖరుకి ఈ పక్రియ పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో రెండు విడతల్లో బస్సు యాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. కొత్త రాజకీయాలు, నూతన ఆర్థిక విధానాల పేరుతో ప్రగతికి పది సూత్రాలు తయారు చేస్తున్నామని, బస్సు యాత్ర ద్వారా వాటిని ప్రజలు ముందు పెడతామని తెలిపారు. ఈ నెల 12న అమరుల స్మృతి చిహ్నం కోసం ఒక రోజు దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు.