తెలంగాణ తిరుపతిగా వెంకన్న కొండ
నిజామాబాద్,ఫిబ్రవరి28(జనంసాక్షి): అందరి సహకారంతో వెంకన్న కొండపై నిర్మించిన వెవెంకటేశ్వర ఆలయాన్ని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా తీర్చిదిద్దుతామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆదివారం జరిగే ఆలయ విగ్రహ ప్రతిష్టాపన, ప్రారంభోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆదివారం కొండపై నిర్వహించే కార్యక్రమం రాజకీయ వేదిక కాదని, ఆధ్యాత్మిక వేదిక అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు డి.సతీశ్, అశోక్, ఎం.నాగేశ్వరరావు, శంభురెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీర్కూర్ శివారులోని వెంకన్న కొండపై నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ విచ్చేయుచున్న సందర్భంగా శనివారం జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. కొండ వెనుక భాగాన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ స్థలాన్ని వారు పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా ట్రయల్ రన్ వేశారు. సీఎం బీర్కూర్ చేరుకొనే సమయంలో కొండపైకి వెళ్లేందుకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఆయన సూచించారు. ఆయన వెంట డీఎస్పీ రామ్‌కుమార్, సీఐలు రమాణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎస్సై రాజభరత్‌రెడ్డిలు ఉన్నారు.