తెలంగాణ తిరుమల ఆలయాన్ని నందనవనంగా మారుస్తా: మంత్రి పోచారం

నిజామాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): బీర్కూర్‌ శివారులో వెంకన్న కొండపై ఉన్న తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని నందనవనంగా మారుస్తానని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్ర ఉద్యానవన సూక్ష్మ నీటిపారుదల శాఖ అధికారులు వెంకన్న కొండకు వచ్చారు. ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి పూల మొక్కలు, పండ్ల తోటలు, సుగంధ ద్రవ్యాల మొక్కలు పెంచేందుకు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెంకన్న కొండను అటవీ శాఖ మహాత్మా గాంధీ ఉపాధి హావిూ పథకంతో కలిసి హరిత వనంగా మారుస్తానన్నారు. ఆలయం ఎదుట ఉన్న చెరువును మిషన్‌ కాకతీయలో భాగంగా పూడిక తీయించి పర్యటక కేంద్రంగా మారుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన రాష్ట్ర కమిషనర్‌ వెంకటరమణారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్‌ హన్మంతరావు, ఏడీ సామ్యూల్‌, పీడీ రాంబాబు, గార్డెన్‌ సూపర్‌వైజర్‌ రాధాకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.