తెలంగాణ పదిజిల్లాల్లో బాబు పర్యటనకు ప్లాన్
మెదక్,ఫిబ్రవరి14(జనంసాక్షి): వరంగల్ పర్యటన విజయవంతం తరవాత ఇక చంద్రబాబు తెలంగాణలోని పది జిల్లాలలో పర్యటన ఉండేలా ప్రణాళిక రచిస్తామని టిడిపి జిల్లా అధ్యక్షురాలు శశికళా యాదవరెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన విజయవంతమైందన్నారు.కొందరు తెరాస శ్రేణులు.. ఎమ్మార్పీఎస్ ముసుగులో ఆటంకాలు కల్పించారని ఆమె ఆరోపించారు. వరంగల్ సభకు కేవలం పార్టీ క్రియాశీలక కార్యకర్తలే భారీ సంఖ్యలో హాజరయ్యారని, దారి పొడవునా జనాలు చంద్రబాబుకు నీరాజనం పలికారన్నారు. టిడిపికి వస్తున్న ఆదరణను టిఆర్ఎస్నేతలు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు తెలుగు రాష్టాల్ర ప్రజలు అభివృద్ది టిడిపి లక్ష్యమన్నారు. టిడిపిని ప్రజలు ఆదరిస్తున్నారనడానికి వరంగల్లో చంద్రబాబు సభ విజయవంతం కావడమే నిదర్శనమన్నారు. అడ్డుకునేందుకు తెరాస చేసిన కుట్రలను ప్రజలు పటాపంచలు చేసినట్లు వివరించారు. ఎస్సీలందరి పట్ల తెదేపా స్పష్టమైన విధానంతో ఉందని వర్గీకరణ అమలు చేసి మాదిగలకు చంద్రబాబు లబ్ది చేకూర్చారని పేర్కొన్నారు. తెరాస ఇచ్చిన హావిూలను అమలుచేయకుంటే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు తెరాస ఇచ్చిన హావిూలు ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. ఇంటికో ఉద్యోగం, రైతుల రుణమాఫీ, ఆసరా, ఫీజు రీయంబర్స్మెంట్.. ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ పూటకో మాట.. రోజుకో హావిూతో తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాలకు నాంది పలకడంతో పాటు బడుగు, బలహీన వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ టిడిపి అన్నారు. అలాంటి పార్టీని నేతలు, కార్యకర్తలు పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండటంతో తెరాస ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న భ్రమలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయని అన్నారు.నీరు, విద్యుత్తుపై పెద్దల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమని చెబుతుంటే తెరాస ఎందుకు వెనకడుగు వేస్తుందో ప్రజలకు చెప్పాలన్నారు. తెదేపాను రెండు ప్రాంతాల్లో అంతమొందించాలని చూసిన కాంగ్రెస్ పాతాళంలోకి పోయిందని మునుముందు తెరాసకు అదే గతిపడుతుందన్నారు.