తెలంగాణ పోరులో ప్రతి ముస్లిం ముందుండాలి
మనది గంగాజమునా తహజీబ్
జేఏసీ మైనార్టీల మనస్సు నొప్పించివుంటే మన్నించాలి :కోదండరాం
టీఎన్జీవో సంఘ వ్యవస్థాపకులు ప్రగతిశీల ముస్లిం యువకులే
మా వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్బుల్గఫార్
సమైక్యాంధ్రలో నష్టపోయింది ముస్లిం ఉద్యోగులే
హైదరాబాద్, ఆగస్టు 14 (జనంసాక్షి) : తెలంగాణ పోరులో ప్రతి ముస్లిం ముందుం డాలని తెలంగాణ టీజేఏసీ చైర్మన్ కోదండరాం ముస్లింలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని టీజేఏసీ కార్యాలయంలో గురువారం జరిగిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణది గంగాజమున తహజీబ్ అని, దీన్ని కాపాడడానికి కృషి చేయాలన్నారు. జేఏసీ ఏ సందర్భంలోనైనా ముస్లింల మనసు నొప్పించి ఉంటే మన్నించాలని కోదండరాం వేడుకున్నారు. తమ నుంచి ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకుంటామని స్పష్టం చేశారు. వచ్చే నెల 30న నిర్వహించే తెలంగాణ మార్చ్‌కు ముస్లింలు కలిసివచ్చి, తమ ప్రత్యేక రాష్ట్ర సాధనాకాంక్షను చాటి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవీ ప్రసాద్ మాట్లాడుతూ టీఎన్జీఓలకు ముస్లింలకు ఉన్న సంబంధంవిడదీయరాదని, టీఎన్జీఓ ఏర్పడడానికి హైదరాబాద్‌లో ఉన్న నలభై శాతం ముస్లిం ఉద్యోగుల క్రియాశీలక పాత్రే కారణమని కొనియాడారు. టీఎన్జీఓల వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్దుల్ గఫారేనని దేవీ ప్రసాద్ గుర్తు చేశారు. సమైక్యాంధ్రలో అత్యధికంగా అణగదొక్కబడింది ముస్లిం ఉద్యోగులేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఓల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, అద్దంకి దయాకర్, రసమయి బాలకిషన్, జూలూరి గౌరీ శంకర్, ముజీబ్, సలీముద్దీన్, హసన్, నజీర్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.