తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కారు

నియంత పాలనను అంతమొందించాలి: భట్టి

ఖమ్మం,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకుని సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ దొరల గడీల్లో నలిగిపోతుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌, మధిర తాజా మాజీ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 70, 80 ఏళ్ల క్రితం ఉన్న దొరల విష సంస్కృతి.. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల ప్రభుత్వాన్ని తీసుకురావాలని తెలిపారు. వచ్చే ఎన్నికలు ప్రజలకు, దొరలకు మధ్య జరిగే పోరాటం లాంటివని, ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు చేయిచేయి కలిపాలన్నారు. ప్రజల ప్రభుత్వం కావాలో.. దొరల ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలన ద్వారా పేద ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని అన్నారు. దుర్మార్గుడి పాలనను రాష్ట్రంలో అంతమొందించాలన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎందరో పోరాడి, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణను దొరల రాజ్యంగా మార్చారని విమర్శించారు. మన నీళ్లు, మన నిధులు మనకే దక్కాలని ఎంతో మంది రాష్ట్ర సాధన కోసం అమరులు అయ్యారని, వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. తెలంగాణ ప్రజల కలలను దూరం చేసి.. వారి బతుకులను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాయ మాటలతో ప్రజల్ని మోసం చేస్తూ.. మరోమారు అధికారాన్ని చేజిక్కించుకుని దొరల పాలన సాగించాలని చూస్తున్నారు.