తెలంగాణ ప్రాతినిథ్యం లేని మీ మీటింగ్‌ సమైక్యాంధ్ర మీటింగ్‌ ఎట్లైతది ?

అది సీమాంధ్ర సమావేశమే : కోదండరామ్‌

వెయ్యిమంది ఆత్మబలిదానాలపై స్పందించని

పార్లమెంట్‌ ఏట్లా అత్యున్నత చట్టసభ అయితది : కేకే
హైదరాబాద్‌, జనవరి 18 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రాంతం నుంచి ఒక్క ప్రతినిధి కూడా హాజరుకాని సభ సమైక్యాంధ్ర సభ ఎలా అవు తుందని, ముమ్మాటికీ అది సీమాంధ్ర సమావేశమే అవుతుందని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. నగరంలోని మింట్‌ కాంపౌండ్‌లో విద్యుత్‌ ఉద్యోగులు చేపట్టిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. తెలంగాణ, సీమాంధ్ర వేర్వేరు అని గురువారమే తేలిపోయిందన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రతినిధుల మీటింగ్‌ మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో జరిగితే గన్‌పార్క్‌లో మరో మీటింగ్‌ జరిగిన విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించారన్నారు. విద్యార్థులు, యువకుల ఆత్మబలిదానాలు, ఉద్యోగుల ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కీలక దశకు చేరుకుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమాన్ని పట్టువిడవొద్దని కాంగ్రెస్‌ పార్టీపై, యూపీఏ ప్రభుత్వంపై పట్టుబిగిస్తూనే పోవాలని సూచించారు. తెలంగాణ సాధనలో ఈనెల 27న నిర్వహించే సమర దీక్ష అత్యంత కీలకమైందని అన్నారు. సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కె. కేశవరావు మాట్లాడుతూ, తెలంగాణ కోసం వెయ్యి మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే స్పందించని పార్లమెంట్‌ ఎట్లా అత్యున్నత చట్టసభ అవుతుందని ప్రశ్నించారు. ఉద్యోగులు, విద్యార్థుల పోరాట ఫలితంగా తెలంగాణ ఉద్యమం కొలిక్కి చేరుకుందని అన్నారు. ఈ సందర్భంగా వెయ్యి మంది విద్యుత్‌ ఉద్యోగులు తెల్లనివస్త్రాలు ధరించి నాలుగు గంటల పాటు శవాలల పడుకొని తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, హరీశ్‌రావు మాట్లాడుతూ, ఢిల్లీ టూర్లు మాని ప్రేమాభిమానాలు చూపాలని సీమాంధ్ర నేతలకు సూచించారు. అన్నదమ్ములా విడిపోదాం.. ఆత్మీయుల్లా కలిసుందామని తెలిపారు. తెలంగాణలో జరిగిన ఆత్మబలిదానాలను కేంద్రానికి, సమైక్యవాదులకు చాటేందుకే విద్యుత్‌ జెఎసి నేడు ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. మరిన్ని వివరాలు కావాలంటే సమైక్యవాదులు మింట్‌ కాంపౌండ్‌ వద్ద వచ్చి జెఎసితో సంప్రదించొచ్చని అన్నారు. పదవుల కోసమే గంటా తంటాలు పడుతున్నా రన్నారు. ఎంపి లగడపాటి రాజగోపాల్‌, మంత్రి శైలజానాధ్‌, తదితరులు ఎన్ని మాట్లాడినా.. వారి స్వార్ధం కోసమే తప్ప.. ప్రజల కోసం కాదన్నారు. కల్లిబొల్లి మాటలను, కుయుక్తులను తెలంగాణ ప్రజలు నమ్మబోరని చెప్పారు.