తెలంగాణ భూముల వేలాన్ని నిలిపివేయండి
హెచ్‌ఎండీఏ ఎదుట తెలంగాణవాదుల ధర్నా
హైదరాబాద్,జూలై 17(జనంసాక్షి):
హైదరాబాద్, రంగారెడ్డి శివారు ప్రాంతాల్లోని భూముల వేలాన్ని నిలిపివేయాలని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు డిమాండు చేశారు. ఇందులో భాగంగా మంగళవారం నాడు నగరంలోని హెచ్‌ఎండిఎ కార్యాలయం ఎదుట కెటిఆర్ నేతృత్వంలో టిఆర్‌ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం పేదల భూములను గుంజుకునేందుకు కిటికీలు తెరిస్తే.. వైఎస్‌ఆర్ ప్రభుత్వం ఏకంగా తలుపులే తెరిచిందని విమర్శించారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి శివారు ప్రాంతాల్లోని భూములకు 2004 వరకు భద్రత ఉందని, 2004 తర్వాత వేలాది ఎకరాలు ప్రభుత్వం పేదల నుంచి లాక్కున్నదని ఆరోపించారు. వైఎస్‌ఆర్ ప్రభుత్వం శివారు ప్రాంతాల్లోని భూములను వేలం ద్వారా 1500 కోట్ల లాభాలను ఆర్జించిందన్నారు. అందులో 30 నుంచి 50శాతం వరకు జగన్ ఖాతాలోకి వెళ్లిందని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలోని భూములను అమ్మి తెలంగాణ ప్రాంత ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలోని భూములను అమ్మి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఖర్చు పెట్టకుండా సీమాంధ్ర ప్రాంతంలో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి శివారు ప్రాంతాల్లోని భూముల విక్రయాల్లో వచ్చిన డబ్బును జలయజ్ఞం పేరుతో సీమాంధ్ర కాంట్రాక్టర్లకు వైఎస్‌ఆర్ కట్టబెట్టారని విమర్శించారు. వేలం ద్వారా వచ్చిన 1500 కోట్ల రూపాయల్లో ఒక్క పైసా కూడా తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేయలేదని విమర్శించారు. వైఎస్‌ఆర్ కుటుంబ సభ్యులు వారి కడుపు నింపుకునేందుకు తెలంగాణ రైతుల పొట్ట కొట్టారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వమే దళారీగా, బ్రోకర్‌గా మారిందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలోని సన్నకారు రైతుల భూములను ప్రభుత్వం ఆక్రమించి తిరిగి వారికి ఒక్క గజం జాగా కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం తెలంగాణ ప్రాంత భూములపై ఇకపై చేయి వేస్తే సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతాన్ని బీడుగా మార్చేందుకు సీమాంధ్ర నేతలు కుట్ర పన్నారని విమర్శించారు. ఇకపై వారి కుట్రలు ఫలించబోవని తారకరామారావు హెచ్చరించారు. ఇదిలా ఉండగా హెచ్‌ఎండిఎ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో టిఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.