తెలంగాణ మంత్రుల భరతం పడతాం

 

హైదరాబాద్‌, నవంబర్‌ 24 : తెలంగాణ ప్రజలను అన్యాయం చేయడం సీమాంధ్ర ప్రభుత్వాలు అలవాటుగా చేసుకున్నాయని తెలంగాణ నగారా సమితి నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను అన్యాయానికి గురిచేస్తున్న ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్‌ కంపెనీలు కూడా మోసం చేస్తున్నాయని నాగం విమర్శించారు. కొన్ని ప్రైవేట్‌ కంపెనీల వ్యవహార శైలితో తెలంగాణ ప్రజలు వివక్షకు గురవుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు 1000 మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నా కేంద్రప్రభుత్వానికి పట్టడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని సాకుగా చూపిస్తూ కొన్ని ప్రైవేట్‌ కంపెనీలు తెలంగాణ యువకులపట్ల వివక్ష చూపుతున్నాయని నాగం ఆరోపించారు. తెలంగాణలోని యువతకు ఆత్మస్థైర్యాన్ని కలిపించేందుకు తాను తెలంగాణ భరోసా యాత్రను చేపట్టినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ కోరుకునే పార్టీలు, సంఘాలు తన యాత్రకు సంఘీభావాన్ని తెలిపాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలను నయవంచనకు గురిచేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి నూకలు చెల్లినట్టేనని నాగం అన్నారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు తమ వైఖరి తెలిపిన తర్వాతే తెలంగాణ ప్రాంతంలో యాత్రలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణపై స్పష్టత ఇవ్వకుండా ఆ పార్టీల నేతలు యాత్రలు చేపడితే తెలంగాణ ప్రజలు సహించరని అన్నారు. ముఖ్యంగా హంద్రీ-నీవా మంత్రి రఘువీరా చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న తెలంగాణ మంత్రులకు సిగ్గులేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ మంత్రులు రఘువీరా యాత్రలో ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. రఘువీరా యాత్రలో పాల్గొన్న తెలంగాణ మంత్రుల నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలకు వాస్తవాలు చెబుతానని ఆయన అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత సాధన కోసం పార్టీలకతీతంగా తెలంగాణ నేతలందరూ ఐక్యం కావాలని నాగం పిలుపునిచ్చారు.