తెలంగాణ మహిళలకు రక్షణ
– గవర్నర్
– సర్కారే సోదరుడు
– సీఎం కేసీఆర్
హైదరాబాద్ ఆగష్టు 29 (జనంసాక్షి):
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రతి ఒక్క ఆడపడుచుకు రక్షణ కల్పిస్తామని, ఆడ శిశువులను రక్షించుకుంటామని గవర్నర్ ఎల్ నరసింహన్ భరోసా కల్పించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్థిల్లాలని అభిలాషించారు. రక్షా బంధన్ వేడుకల్లో భాగంగా శనివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, విమల నరసింహన్ దంపతులు పాల్గొని పాఠశాలల చిన్నారుల నుంచి అభినందనలు అందుకున్నారు. మహిళామణులకు సీఎం కేసీఆర్ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. అక్క చెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల అనుబంధానికి రక్షాబంధన్ ప్రతిక అని వెల్లడించారు. మహిళలను అన్నిరకాలుగా కాపాడుకోవాలన్నదే రక్షాబంధన్ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వమే సోదరుడిగా ఉంటుందని బరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరులోని నాగార్జున వర్శిటీలో ర్యాగింగ్‌కు రిషితేశ్వరి అనే విద్యార్థిని బలైన ఘటనపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా వున్నాయని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ర్యాగింగ్ నిర్మూలన కోసం విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో యాంటి ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించారు. మళ్లీ ర్యాగింగ్ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో మహిళలకు ఇంజక్షన్ సూదులను గుచ్చి పారిపోతున్న సైకోను త్వరలో పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సంచలనాల కోసం పాకులాడవద్దని విూడియాకు హితవు పలికారు. సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వేడుకల్లో పాఠశాలల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని గవర్నర్ దంపతులకు రాఖీలు కట్టారు. జవహర్ హైస్కూల్‌కు చెందిన ముస్లిం విద్యార్థినులు గవర్నర్ దంపతులకు రాఖీ కట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రహ్మకుమారీస్ మఠం బీకే కుల్దీప్, బీకే మంజు, బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర నేతలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విూడియాకు రక్షణ : రాజ్‌భవన్‌లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఓ ఎలక్ట్రానిక్ విూడియా మహిళా విలేఖరి గవర్నర్‌కు రాఖీ కట్టారు. రిపోర్టర్ రాఖీ కట్టారు. విూడియాకు సైతం రక్షణ కల్పిస్తాం అని చమత్కరించడంతో నవ్వులు విరిశాయి.