తెలంగాణ రాష్ట్రానికి జయశంకర్ సార్ ఐకాన్

తెలంగాణ ఏర్పాటుకు  అవిశ్రాంతంగా పోరాటం చేసిన యోధుడు
 జయశంకర్ సార్ ఆశయసిద్ధికి అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన
 – మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రానికి దివంగత ఆచార్య జయశంకర్ సార్ ఐకాన్ లాంటి వారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు.తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జీవిత చరమాంకం వరకు అవిశ్రాంతంగా పోరాటం చేసిన యోధుడని పేర్కొన్నారు.దివంగత ఆచార్య జయశంకర్ సార్ 11వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను ఆంద్రప్రదేశ్ లో కలిపిన రోజునే బలంగా వ్యతిరేకించిన యోధుడు జయశంకర్ సార్ అని  తెలిపారు.అటువంటి మహానుబావుడి సంకల్పసిద్ధికి అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలనను కొనసాగిస్తున్నారన్నారు.ఈ రోజున సార్ జీవించి ఉంటే సీఎం కేసీఆర్ పాలనలో తాను కన్న కలలు సాకారం అవుతున్నందుకు ఎంతగానే సంబురపడేవారని చెప్పారు.తెలంగాణ వెనుకబాటుకు గురైన ప్రాంతం కాదని వెనుకబాటుకు నెత్తివేయబడిన ప్రాంతమంటూ వేల సభలలో జయశంకర్ సార్ చేసిన ఉపన్యాసాలను గుర్తుచేశారు.అటువంటి సహజ వనరులను సద్వినియోగ పరుచుకొని ఎనిమిదేండ్ల పాలనలో యావత్ భారతదేశంలోనే తెలంగాణను సీఎం  కేసీఆర్ ముందు వరుసలో నిలబెట్టారన్నారు.అద్భుతమైన విజన్,అంతకుమించి చక్కటి పాలనను అందిస్తున్న సీఎం కేసీఆర్ దార్శనికత తోటే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాదించిందన్నారు.ఇది ఎవరో చెబితే తెలిసింది కాదని ఎనిమిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనకు స్వయాన కేంద్రప్రభుత్వమే కితాబునివ్వడం ఇందుకు అద్దం పడుతుందన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన  అభివృద్ధి చెందిన గ్రామాల లిస్ట్ లో ఒకటి నుండి పందొమ్మిది వరకు తెలంగాణ రాష్ట్ర పల్లెలు ఉండడం, పట్టణాల వరుసలోను ఒకటి నుండి పది వరకు కేంద్రప్రభుత్వ లిస్ట్ లో ముందుండడమే సీఎం కేసీఆర్ పాలనకు తార్కాణంగా అభివర్ణించారు.అంతకు మించి వేగవంతమైన వ్యవసాయ అభివృద్ధి, విద్యుత్ రంగంలో సాధించిన అద్భుతమైన విజయాలతో పాటు పారిశ్రామిక రంగంలో కొత్తగా ప్రకటించిన పాలసీ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది అంటే జయశంకర్ సార్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ చేస్తున్న పాలనకు నిదర్శనమని  కొనియాడారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ , వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ , మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితా ఆనంద్ ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ ,టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ , పలువురు ప్రజాప్రతినిధులు , నాయకులు తదితరులు పాల్గొన్నారు.