తెలంగాణ విమోచన జరపలేక ఎదురుదాడా?
అధికార పార్టీపై కాంగ్రెస్, టిడిపి నేతల విమర్శ
పలుచోట్ల జెండా ఆవిష్కరించిన నేతలు
వరంగల్,సెప్టెంబర్17(జనంసాక్షి): తెలంగాణ విమోచనను జరపలేక ఎదురుదాడి చేస్తూ విమర్శలు చేస్తున్న టిఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని కాంగ్రెస్, టిడిపి నేతలు అన్నారు. విమోచనను అవమానించిన పార్టీగా టిఆర్‌ఎస్ చరిత్రలో నిలచిపోతుందన్నారు. వరంగల్ జిల్లాలో వేర్వేరుగా కాంగ్రెస్,టిడిపిలు విమోచన ఉత్సవాలను నిర్వహించారు. పలుచోట్ల జెండా ఎగుర వేసి అమిరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తెరాస ప్రభుత్వం గతంలో ఇచ్చిన హావిూలను నెరవేర్చడంలో విఫలమైందని మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. అమరులను అవమాన పర్చిన ఘనత టిఆర్‌ఎస్‌దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు తాను ప్రభుత్వ చీఫ్‌విప్‌గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామన్నారు. టిఆర్‌ఎస్ విపక్షాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేశారని దుయ్యబట్టారు. పార్టీలు పోటీ చేసే సీట్ల సంఖ్యపై చర్చ జరుగుతోందని అందులో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలో తేలాక ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలో ప్రకటిస్తారన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెదేపా మహాకూటమితో కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థపై అధికార పార్టీ నాయకుల దాడి చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇదిలావుంటే విమోచనోత్సవాలను అధికారికరంగా జరపాలని ఉద్యమ సమయంలో చేసిన డిమాండ్‌ను టిఆర్‌ఎస్ తుంగలో తొక్కిందని టిడిపి పోలలిట్ బ్యూరో సభ్యుడు రేవఊరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. దీనికి గుణపాఠం తప్పదనిహెచ్చరించారు. విపక్షాలు ఏకం కావడంతో దిక్కుతోచని స్థితిలో టిఆర్‌ఎస్ ఉందన్నారు. ఉద్యమ సమయంలో మద్దతు ఇచ్చిన ప్రజలు తాజాగా మార్పు కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదని చెప్పారు. నాలుగున్నర ఏళ్లలో చేయని పనులు రెండు నెలల్లో చేస్తామని తెరాస ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ప్రజలు సమాయత్తమవుతున్నారని తెలిపారు. ఓట్లను కొనేందుకు రైతుబంధు పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాయితీ ట్రాక్టర్ల ఆశ చూపి తెరాస నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇతర పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. రాయితీ ట్రాక్టర్లు మాకిస్తే… నాయకుడికి ఫార్చ్యూనర్ కారు వచ్చిందని అధికార పార్టీ నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోందన్నారు. విద్యుత్తు మోటార్ల పేరుతో సుదర్శన్‌రెడ్డి మరో నాటకానికి తెర లేపుతున్నాడని చెప్పారు.