తెలంగాణ సచివాలయంలో ఊడిపడ్డ పెచ్చులు
రెయిలింగ్ ఊడిన ఘటనపై విచారణ చేయాలని ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రెటరీని ఆదేశించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్‌లోసీఎం చాంబర్ పక్కన పెచ్చులు ఊడిన ఘటనపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. ఈ విషయమై శుక్రవారం(ఫిబ్రవరి14) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రెయిలింగ్ ఊడిన ఘటనపై విచారణ చేయాలని ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రెటరీని ఆదేశించినట్లు తెలిపారు.
విచారణ నివేదిక వచ్చాక అసలు విషయం ఏంటనేది తెలియజేస్తాం.ప్రభుత్వానికి రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) లాంటి ప్రధానమైన పనులు చాలా ఉన్నాయి.పెచ్చులు ఊడటం చిన్న విషయం..ఆ అంశాన్ని అధికారులు చూసుకుంటారు’అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
కాగా, ఇటీవల తెలంగాణ సచివాలయంలో పీవోపీ పార్టిషన్ స్వల్పంగా కూలింది. పెచ్చులు ఊడిపడ్డాయి. సీఎం ఛాంబర్ అంతస్తులో పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడి కింద ఉన్న రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుపై పడ్డాయి. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పెచ్చులు ఊడిపడడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు.
పీఓపీ పెచ్చులు ఊడి పడటంతో అధికారులు, భదత్రా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయం పీఓపీ కూలడం చర్చనీయాంశంగా మారింది. సచివాలయ నిర్మాణ లోపాలపై చర్చ జరుగుతోంది.