తెలంగాణ సాధించే వరకూ .. పోరుబాటలోనే టీఎన్‌జీవో
టీఎన్‌జీవో నూతన అధ్యక్షుడుగా దేవీప్రసాద్
హైదరాబాద్, జూలై 29 (జనంసాక్షి):
తెలంగాణ రాష్ల్రాన్ని సాచుకొనేంత వరకు పోరుబాటను వీడేది లేదని టీఎన్‌జీవో నూతన అధ్యక్షుడు దేవీ ప్రసాద్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొనేవరకు అవిశ్రాంత పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. టీఎన్‌జీవో అధ్యక్షుడిగా స్వామిగౌడ్ పదవీకాలం ముగిసి నందున ఆదివారం టీఎన్‌జీవో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీఎన్‌జీవో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. పదవీవిరమణ చేసిన స్వామిగౌడ్ స్థానంలో కొత్త అధ్యక్షుడిగా దేవీప్రసాద్ ఎన్నికయ్యారు. ఇంత వరకు దేవీప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విషయం తెలిసిందే. ఈయన కొత్త అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఈయన స్థానంలో నూతన ప్రధాన కార్యదర్శిగా కారెం రవీందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో టీఎన్‌జీవో ముఖ్య పాత్రను పోషిస్తుందనీ, తెలంగాణ వచ్చేవరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామనీ తెలిపారు. తెలంగాణ వచ్చేవరకు పోరుబాటలోనే కొనసాగుతామని, ఎలాంటి ఒడిదొడుకులు లోనైనా ఉద్యమ పంథాను వీడేది లేదన్నారు. తెలంగాణ సాధనే అంతిమ లక్ష్యంగా పోరాటం జరపడం కోసం తెలంగాణ రాజకీయ జేఏసీ సెప్టెంబర్30న నిర్వహించ తలపెట్టిన మార్చ్‌కు మద్దతిస్తామనీ, జేఏసీతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. గత కొంత కాలంగా రాజకీయ నాయకులు ఆడుతున్న దోబూచుటాలను ఎండగట్టి సీమాంధ్ర పార్టీలు తగిన బుద్ది చెప్పి తెలంగాణ వచ్చే వరకు అవిశ్రాంత పోరాటం చేస్తామని, రాజకీయ నాయకులు కూడా ఈ ఉద్యమానికి మద్దతివ్వాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులపై ఈగ వాలినా సహించేది లేదన్నారు.