తెలంగాణ సారస్వత పరిషత్‌కు పెద్ద చరిత్ర

– తెలుగుభాష పరిరక్షణకు కృషిచేయాలి
– ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు
– ఘనంగా సారస్వత పరిషత్‌ డైమండ్‌ జూబ్లీ వేడుకలు
హైదరాబాద్‌, మే26(జ‌నంసాక్షి) : తెలంగాణ సారస్వత పరిషత్‌కు పెద్ద చరిత్ర ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. సారస్వత పరిషత్‌ డైమండ్‌ జూబ్లీ వేడుకలకు వెంకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ..సారస్వత పరిషత్‌ 75 ఏళ్ల ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రశ్నించడం ద్వారా జ్ఞానం కలుగుతుందని, అంతే కానీ స్వతహాగా రాదని వెల్లడించారు. తరతరాలుగా భాష, సంస్కృతులపై దాడులు జరిగాయన్నారు. పరాయి పాలనలో మగ్గిన దేశాలు భాష, సంస్కృతులు కోల్పోయాయని వెంకయ్య పేర్కొన్నారు. తెలుగు సాహిత్య పరిరక్షణకు పలువురు మహానుభావాలు కంకణం కట్టుకున్నారని, అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గకుండా సారస్వత్‌ పరిషత్‌
ఏర్పాటుకు కృషి చేశారన్నారు. భాష, కళలు, వాక్కు, సాహిత్యం.. సరస్వతి దేవి మనకు అందించిన వరాలని అన్నారు. తెలుగు భాష పరిరక్షణకు కేసీఆర్‌ చేస్తోన్న కృషిని వెంకయ్య కొనియాడారు. ఆధునికత పేరుతో ఆంగ్ల భాషపై వ్యామోహం పెరిగిందని.. ఆంగ్ల భాష వస్తేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయనే భావన ప్రజల్లో ఉందని అన్నారు. విజ్ఞానమంటే కేవలం సాహిత్యానికే పరిమితం కాదని.. వివేకం, విజ్ఞానం, చైతన్యానికి ప్రతీక అని వెంకయ్య తెలిపారు. ఉర్దూ చలామణిలో ఉన్న నిజాం ప్రభువుల హయాంలో తెలంగాణ సారస్వత పరిషత్తు తెలుగు సాహిత్య విలువలను కాపాడటం అసాధారణ విజయం అన్నారు. ఈ సందర్భంగా సారస్వత పరిషత్తు ప్రచురించిన పుస్తకాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.