తెలుగుజాతి చరిత్ర ఘనం :బ్రిటన్‌ ఎంపీ సైమన్‌ ప్రశంస

లండన్‌: భారత్‌, బ్రిటన్‌ల మధ్య సంబంధాలు దృఢమైనవి బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యుడు సైమన్‌ హీజెన్‌ పేర్కొన్నారు. ఇక్కడి బ్రిటిష్‌ లైబ్రరీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు చరిత్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గోని ప్రసంగించారు. తెలుగుజాతికి ఘనమైన చరిత్ర ఉందని..ప్రపంచ నలుమూలల్లో వివిధ రంగాల్లో తెలుగువారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆయన కొనియాడారు.  ఒలంపిక్స్‌లోనూ తెలుగువారు తమ కీర్తిపతాకాలను ఎగరవేయాలని ఆకాక్షించారు. బ్రిటన్‌లో వివిధ మ్యూజియాల్లో ఉన్న తెలుగు చరిత్రను పరిరక్షిస్తామన్నారు. శాసన మండలి చైర్మన్‌ చక్రపాణి, మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్‌లు బ్రిటన్‌ ఎంపీని సత్కరించారు. రాష్ట్రప్రభుత్వం తరపున శిల్పారామం సంచాలకుడు వి.ఎన్‌.రావు సదస్సుకు హాజరైనవారికి  జ్ఞాపికలు అందజేశారు. ప్రతి రెండోళ్లకోసారి తెలుగు చరిత్ర తెలిసేవిధంగా పాఠ్యప్రణాళిక రూపోందించాలని పలు తీర్మానాలు చేశారు. రాష్ట్రానికి చెందిన పలువురు పరిశోధకులు తమ పరిశోధన పత్రాలను ఈ సందర్భంగా సమర్పించారు. యునైటెడ్‌ కింగ్‌డవమ్‌ తెలుగు సంఘం (యుక్తా ) నిర్వాహకులు ఎ.రామకృష్ణ, కె.ప్రభాకర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.