తెలుగు ప్రజల ఉక్కు సంకల్పాన్ని దెబ్బతీసిన కేంద్రం

బయ్యారం,కడపలలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని వెల్లడి

సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పణ

మెకాన్‌ సంస్థ అధ్యయనంతో సాధ్యం కాదని తేలిందని వాదన

కేంద్రం తీరుపై మండిపడుతున్న ప్రజలు

న్యూఢిల్లీ,జూన్‌13(జ‌నం సాక్షి ): ఉక్కు సంకల్పం దెబ్బతింది. కేంద్రం మన ఆశలపై నీళ్లు చల్లింది. తెలుగు ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న బయ్యారం,కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం బుధవారం తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మాత్రమే కర్మాగారాలను ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని కేంద్రం పేర్కొంది. తొలి ఆరు నెలల్లోనే సాధ్యం కాదని చెప్పినా.. పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచనలు వచ్చాయన్న కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్పష్టంగా నివేదిక వచ్చినట్టు పేర్కొంది. మ ప్రభుత్వం ఏర్పాటైన ఆర్నెళ్లలోనే ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యంకాదని, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు నష్టాల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పామని స్పష్టం చేసింది. అలాగే ఖనిజాలు దొరకడం కూడా కష్టతరమైన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కొత్తగా రెండు రాష్ట్రాల్లో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు సాధ్యం కాదని తాము స్పష్టంచేశామని కేంద్రం తెలిపింది. అనేక మంత్రిత్వ శాఖలు, కేంద్రంలోని పలువురు మంత్రులు మరోసారి పరిశీలించాలని చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో మెకాన్‌ సంస్థతో పూర్తిస్థాయిలో అధ్యయనం చేశామని వెల్లడించింది. ఆ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా చూస్తే.. బయ్యారం, కడపలో రెండు చోట్లా ఉక్కు పరిశ్రమల ఏర్పాటు సాధ్యంకాదని, ఇప్పటికప్పుడు చేయడం వల్ల నష్టమే వస్తుంది గనక సాధ్యంకాదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇప్పటికే వీటిపై కోర్టుల్లో దాఖలైన పిటిషన్లకు తాము సమాధానాలు చెబుతున్నామని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఇకపోతే విభజన చట్టంలో ఉన్న కడప స్టీల్‌ ఫ్లాంట్‌ ఏర్పాటు చేయడానికి కేంద్రం ఏమాత్రం సుముఖంగా లేదన్నభావన వ్యక్తమవుతోంది. విభజన హావిూల అమలుపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. అందులో ఏపీ, తెలంగాణలో స్టీల్‌ ఫ్యాక్టరీల నిర్మాణం సాధ్యం కాదనే రిపోర్టులు వచ్చాయని కేంద్రం తెలిపింది. అయినా మరో టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం మెకాన్‌ అనే సంస్థ కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ సాధ్యా సాధ్యాలపై పరిశీలన జరుపుతోందని, ఆ సంస్థ పూర్తిస్థాయి నివేదిక ఇవ్వలేదని కేంద్రం కోర్టుకు తెలిపింది. మెకాన్‌ సంస్థ రెండు రాష్ట్ర ప్రభుత్వాలతోనూ సమాచారం పంచుకుంటోందని, కడప స్టీల్‌ ప్లాంట్‌తో పాటు బయ్యారం వ్యవహారం కూడా టాస్క్‌ ఫోర్స్‌ పరిధిలో ఉందని అన్నారు. ఇలాంటి సమయంలో విభజన హావిూలపై పిటిషన్‌ విచారణ అర్హం కాదంటూ కేందం అఫిడవిట్‌లో పేర్కొంది. కొద్ది రోజుల నుంచి కేంద్రం తీరు కడప స్టీల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉంది.

చర్చలకు రమ్మని అంతలోనే….

కేంద్ర ఉక్కు గనుల శాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో టాస్క్‌ఫోర్స్‌ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో స్టీల్‌ ప్లాంట్ల ఏర్పాటుపై చర్చించేందుకు ఈ భేటీకి రావాలని కేంద్రం నుంచి పిలుపు రావడంతో రెండు రాష్ట్రాల గనుల శాఖ ఉన్నతాధికారులు టాస్క్‌ఫోర్స్‌ భేటీలో పాల్గొన్నారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై కేంద్రం స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తుందని

రాష్ట్రాధికారులు ఆశించారు. కానీ అలాంటిదేవిూ లేదు. తాను కొత్తగా బాధ్యతలు స్వీకరించినందున స్టీల్‌ ప్లాంట్లకు సంబంధించి సమగ్ర సమాచారం తెలుసుకునేందుకే సమావేశానికి పిలిపించానని కేంద్ర గనుల శాఖ సంయుక్త కార్యదర్శి చెప్పడంతో ఇరు రాష్ట్రాల అధికారులూ విస్తుపోయారు. స్టీల్‌ ప్లాంట్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం మరింత జాప్యం చేసేందుకే ఇలా సమావేశాల పేరిట కాలయాపన చేస్తోందని ఏపీ గనుల శాఖ కార్యదర్శి శ్రీధర్‌, ఏపీఎండీసీ ఎండీ సీహెచ్‌వీ చౌదరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు విషయంలో తెలంగాణతో ఆంధ్రప్రదేశ్‌కు లంకె ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ‘మా రాష్ట్రంలో అపారమైన ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఇనుప ఖనిజ లభ్యతపై క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే జరిపిన మెకాన్‌ సంస్థకు కోరినంత సమాచారం అందించాం. ఆ సంస్థ ముసాయిదా నివేదిక ఇవ్వడంతో రాష్ట్రంలో స్టీల్‌ ఎ/-లాంటు ఏర్పాటుకు మార్గం సుగమమైందని సంతోషించాం. కానీ తెలంగాణ నుంచి నివేదిక రాలేదంటూ ఆంధ్రలో స్టీల్‌ ప్లాంటు అంశాన్నీ అటకెక్కించడమేంటి’ అని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న కడప స్టీల్‌ ప్లాంట్‌ అంశాన్ని ఎటూ తేల్చకపోవడంతో రాష్ట్ర ప్రజల్లో ఆగ్రహం మిన్నంటుతోందని తెలిపారు. రాష్ట్రంలో అపార ఖనిజ నిక్షేపాలున్నాయంటూ మెకాన్‌ సంస్థ నివేదిక ఇచ్చినా ఎందుకు జాప్యం చేస్తున్నారని కేంద్రాన్ని నిలదీశారు. తెలంగాణతో సంబంధం లేకుండా ఏపీలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు అనువైన ఖనిజ నిక్షేపాలున్నాయంటూ ముసాయిదా నివేదికను ఇచ్చారా.. రాష్ట్రం సర్వేకు అన్ని విధాలుగా సహకరించిందా అని మెకాన్‌ ప్రతినిధులను కేంద్ర సంయుక్త కార్యదర్శి ప్రశ్నించారు. తాము ఇప్పటికే ముసాయిదా నివేదిక సమర్పించామని, త్వరలోనే తుది నివేదికను సమర్పిస్తామని మెకాన్‌ ప్రతినిధులు చెప్పారు. దీంతో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర సంయుక్త కార్యదర్శి నింపాదిగా చెప్పారు. కేంద్రానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నందున .. తెలంగాణతో లంకె పెట్టకుండా ఏపీలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటుకు కార్యాచరణను ప్రకటించాలని రాష్ట్ర అధికారులు కోరారు. మెకాన్‌ ముసాయిదా నివేదికను తమకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహరాంపై ఎపి, తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. కొత్తగ ఆప్లాంట్‌ పెట్టి నిరుద్యోగులకు ఆశ కల్పిస్తారనుకుంటే నీళ్లు చల్లారని మండిపడ్డారు.