తెలుగు భాషకు ముప్పు వచ్చినట్లేనా?

ఇంగ్లీష్‌ విూడియం ప్రకటనతో సర్వత్రా ఆందోళన
విజయవాడ,నవంబర్‌14(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషకు ముప్పు ముంచుకొస్తున్నదన్న విమర్శలు ఊపందుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంద్వారా సామాన్యులకు కూడా ఇంగ్లీష్‌ చదవులను అందించాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఇది ఓ రకంగా ఆంగ్ల మాధ్యమం కోసం ప్రైవేట్‌ పాఠశాలలను ఆశ్రయిస్తూ వేల రూపాయలను ధారపోస్తున్న వారికి ఊరటనిచ్చేదిగా చూడాలి.అందుకే జగన్‌ పకడ్బందీ రాజకీయ వ్యూహంతో ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చాలని నిర్ణయించారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టినంత మాత్రాన తెలుగు భాషే కనుమరుగు అవుతుందన్న వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీంతో ఇప్పుడు ఎవరికి వారు తెలుగు భాష కనుమరుగవుతుందన్న బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే పాఠశాలలను బలోపేతం చేసేందుకు జగన్‌ ప్రకటించిన మేరకు మూడేళ్ల కాలంలో మూడు దశల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారు. ఇందుకోసం రూ.12,000 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. మొదటి దశ కింద 15715 పాఠశాలల్లో 9 రకాల మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. ఇందుకోసం రూ.3627కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. మొదటి దశలో గ్రావిూణ,గిరిజన, పట్టణ,గురుకుల పాఠశాలల అభివృద్దికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో కలెక్టర్లు నాడు-నేడు కార్యక్రమాన్ని చేపడుతారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన అనంతరం ఫోటోలు తీసి వాటిని ప్రభుత్వ పోర్టల్‌లో పొందుపరుస్తారు. ఒకప్పుడు స్కూల్స్‌ ఎలా ఉండేవి.. వైసీపీ అధికారంలోకి వచ్చాక స్కూళ్లు ఎలా మారిపోయాయి అన్న తేడాను ఫోటోల ద్వారా ప్రజలకు చూపించనున్నారు. ఇకపోతే ఇంగ్లీష్‌ విూడియం ఇదే అంశంపై చంద్రబాబును విమర్శించిన ప్రస్తుత అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఇప్పుడు సమర్థించడం గమనార్హం. ఇకపోతే తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆయన ఎమ్మెల్యేలు మట్టిలో కలిసిపోవడం ఖాయమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. ఒక ప్రాంత, సంస్కృతి, సంప్రదాయాలను మాతృభాషే తెలియజేస్తుందన్నారు. ప్రభుత్వం భాషను చాలా నిర్లక్ష్యం చేస్తోంది. తెలుగు శిలాశాసనాలు మొట్టమొదటిగా లభించిన రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ఈ విధంగా చేయడం అత్యంత దారుణం. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాష అవసరమే అయినా తెలుగును మాత్రం చంపకూడదు. మేం తెలుగు భాష గురించి మాట్లాడితే, మా పిల్లలు ఏ విూడియంలో చదువుతున్నారని ప్రశ్నించారని మండిపడ్డారు. నేను చదువుకున్నది తెలుగు విూడియంలోనే. నా ప్రాథమిక విద్యంతా తెలుగు విూడియంలోనే సాగిందని పవన్‌ వివరించారు. మన రాజకీయ నేతలకు తెలుగు భాషపై ప్రేమాభిమానాలు లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి ఉన్నా తెలుగు విూడియంను అమలు చేసి తీరాల్సిందేని కుండబద్దలు కొట్టారు.