తెల్లరేషన్‌కార్డుదారులకు శుభవార్త

` జనవరి నుంచి సన్న బియ్యం అందజేత
` అవసరమైన చోట రాయితీ ధరలకు గోధుమలు అందిస్తాం
` కాంగ్రెస్‌ ప్రభుత్వ ఎన్నికల వాగ్ధానంలో ఈ పథకం అత్యంత కీలకం
` నాణ్యమైన బియ్యం వినియోగదారులకు అందించడానికి ప్రాధాన్యత
` పీడీఎస్‌ బియ్యం దారి మళ్లిస్తే కఠిన చర్యలు
` రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించి వారికి ప్రోత్సాహకాలు అందిస్తాం
` చౌక ధరల దుకాణాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
` రాష్ట్ర స్థాయి విజిలెన్స్‌ కమిటీ సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
` హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో రేషన్‌కార్డు దారులందరికీ వచ్చే ఏడాది జనవరి నుంచి సన్న రకం బియ్యం పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్‌ కమిటీ సమావేశానికి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. పౌరసరఫరాలశాఖకు సంబంధించిన కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సవిూక్ష చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ఎన్నికల వాగ్ధానంలో ఈ పథకం అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. నాణ్యమైన బియ్యం వినియోగదారులకు అందించడం ప్రాధాన్యత అని వివరించారు. అవసరమైన చోట రాయితీ ధరలకు గోధుమలు కూడా సరఫరా చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. పీడీఎస్‌ బియ్యం దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్‌ డీలర్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించి వారికి ప్రోత్సాహకాలు అందజేస్తుందని హావిూ ఇచ్చారు. చౌక ధరల దుకాణాల్లో 1,629 ఖాళీలు ఉన్నాయని ఆరా తీసిన ఉత్తమ్‌..వెంటనే భర్తీ చేయాలని అధికారులను కోరారు. వివిధ సమస్యలపై 10 రోజుల్లో సమగ్ర నివేదిక అందజేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ మంత్రికి హావిూ ఇచ్చారు.