తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల బహిష్కరణ
రైతుల ‘సహకారం ‘ మాకే లభించింది : బొత్స
హైదరాబాద్, ఫిబ్రవరి1 (జనంసాక్షి) :
గోడదూకి జగన్ వైపు వెళ్లే ఎమ్మెల్యేల దూకుడుకు పిసిసి ముకుతాడు వేయబోతోంది. అలాంటి వారిపై సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా నష్ట నివారణ చర్యలకు దిగారు. జగన్ వైపు వెళ్లిన తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అమ్ముడు పోయే వారిని, వ్యక్తిత్వం లేని వారిని పట్టించుకోమని ఆయన తేల్చిచెప్పారు. పార్టీ నుంచి బహిష్కరించిన వారి పేర్లను వెల్లడించేందుకు బొత్స నిరాకరించారు. బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేల అనర్హత వేటు-పై త్వరలోనే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పేర్ని నాని, ఆళ్ల నాని, సుజయ కృష్ణ, రాజేష్, ద్వారంపూడి చంద్రశేఖర్‌తో పాటు- పలువురిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు సమాచారం. జగన్ వైపు వెళ్తున్న ఎమ్మెల్యేలను తాము పార్టీ నుండి బహిష్కరించామని ఆయన చెప్పారు. డబ్బుల కోసం ఇతర నేతలకు అమ్ముడుపోయిన, వ్యక్తిత్వం లేని వారిని తాము పట్టించుకోమన్నారు. నేతల తీరుపై తాము తెలుగుదేశం పార్టీలాగా పూటకోమాట మాట్లాడమని చెప్పారు. జగన్ వైపు వెళ్తున్న తొమ్మిది మందిని తాము బహిష్కరించామన్నారు. రాజీనామాలు చేసిన వారి గురించి సభాపతి నాదెండ్ల మనోహర్ చూసుకుంటారన్నారు. అనర్హతపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. సహకార ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వచ్చినందు వల్లే కాంగ్రెసు ఈ నిర్ణయం తీసుకొని ఉండి ఉంటుందంటున్నారు. కాగా జగన్ వైపు ఇటీవల పలువురు కాంగ్రెసు ఎమ్మెల్యేలు వెళ్లిన విషయం తెలిసిందే. వారి పైనే వేటు వేసి రానున్న ప్రమాదాన్ని తగ్గించుకోవాలన్నది కాంగ్రెస్ నిర్ణయంగా తెలుస్తోంది. మరో ముగ్గురిలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జోగి రమేష్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్నారు. 2009లో కాంగ్రెసు పార్టీ టిక్కెట్ పైన గెలిచిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ తొమ్మిది మందిలో ఇప్పటికే కొందరు జగన్ పార్టీలో చేరగా మరికొందరు చేరుతామని ప్రకటించారు. ఇంకొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుపొందడంతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో బొత్స విూడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు, పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రెండో విడతలోనూ కాంగ్రెస్ ఇదే స్థాయిలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 60 శాతం వరకు సొసైటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పారు. ప్రతిపక్షాలన్నీ కలిసినా 40 శాతం స్థానాలు గెలవలేదని విమర్శించారు. తాము రైతులకు వెన్నంటి ఉంటామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలు అక్రమ కూటమి కట్టినా కాంగ్రెస్‌ను నిలువరించలేదన్నారు.