తొలి టెస్ట్‌లో వికెట్కీపర్‌ పంత్‌ దూకుడు

వన్డే తరహాలో బౌలర్లను బాదిని పంత్‌
97 బంతుల్లో 96 పరుగులకు ఔట్‌
మొహాలీ,మార్చి4(ఆర్‌ఎన్‌ఎ):శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ దూకుడైన ఆటతీరు కనబరిచాడు. క్రీజులో ఉన్నంతసేపు లంక బౌలర్లలను దడదడలాడిరచిన పంత్‌ వన్డే తరహాలో ఇన్నింగ్స్‌ ఆడాడు. కచ్చితంగా సెంచరీ చేస్తాడనుకుంటున్న తరుణంలో 96 పరుగుల వద్ద ఔట్‌ అయ్యి కేవలం నాలుగు పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడు. పంత్‌ 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు. తొలి హాఫ్‌ సెంచరీకి 75 బంతులు తీసుకున్న పంత్‌.. సెంచరీ చేసే క్రమంలో 22 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు. దీన్నిబట్టే పంత్‌ బ్యాటింగ్‌ ఎంత విధ్వంసరంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక పంత్‌ సెంచరీ చేసే క్రమంలో తొంబైల్లో ఔటవ్వడం ఇది ఐదోసారి. ఇంతకముందు 2018లో వెస్టిండీస్‌పై(రాజ్‌కోట్‌) 92 పరుగులు, 2018లో వెస్టిండీస్‌పై(హైదరాబాద్‌) 92 పరుగుల వద్ద, 2021లో సిడ్నీ వేదికగా ఆస్టేల్రియాపై 97 పరుగులు, 2021 చెన్నై వేదికగా ఇంగ్లండ్‌పై 91 పరుగుల వద్ద ఔటయ్యాడు. తాజాగా శ్రీలంకపై మొహలీ వేదికగా 96 పరుగులు చేసి ఔట్‌ అయి నెర్వస్‌ నైంటీస్‌ ఫోబియా బారిన పడ్డాడు. ఇక వికెట్‌కీపర్లలో తొంబైల్లో ఎక్కువసార్లు ఔటైన జాబితాలో పంత్‌ రెండో స్థానంలో ఉన్నాడు. పంత్‌ కంటే ముందు ఎంఎస్‌ ధోని 90ల్లో ఎక్కువసార్లు ఔటైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇక టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు నెర్వస్‌ నైంటీస్‌ ఫోబియా ఎక్కువగా ఉండేదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.