త్రివేణి సంగమం వద్ద గోదావరి పరవళ్లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు
ఆనందంలో ఆయకట్టు రైతాంగం
నిజామాబాద్,ఆగస్టు 21(జనం సాక్షి): జిల్లాలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వస్తోంది. ఎగువన మహారాష్ట్రలోని గైక్వాడ్, అంబురా, విష్ణుపురి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతుండటంతో? బ్రిడ్జిని ఆనుకొని ప్రవహిస్తోంది. కందకుర్తి వద్ద మంజీరా, ఆరుద్ర, గోదావరి పోటెత్తుతోంది. చారిత్రక శివాలయం పూర్తిగా నీట మునిగింది. 2 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి చేరుతుండటంతో జలకళను సంతరించుకుంది. దీంతో ఎస్సారెస్పీ నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. ఇన్నాళ్లు ఎస్సారెస్పీలో నీరు లేక ఇబ్బంది పడ్డ ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మరో రెండ్రోజులు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. వరద ఉధృతంగా ఉండటంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.ఉత్తర తెలంగాణ జిల్లాల వర ప్రదాయిని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా మంగళవారం ఉదయం 9 గంటల వరకు ప్రాజెక్టులో నీటి మట్టం 1077.40 అడుగులుగా నమోదయ్యింది. ప్రాజెక్టులో 45.700 టీఎంసీల నీటి నిల్వ ఉంది.ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి 1,38,880 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. గతవారం రోజుల వ్యవధిలో ప్రాజెక్టులో 29 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టుకు జలకళ సంతరించుకోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. ఇదిలావుంటే ఎడతెరిపి లేని వర్షాలతో బాన్సువాడ మండలంలోని గ్రామాల్లోని చెరువులన్నీ జలకళ సంతరించుకున్నాయి. వరి పంటలు నీట మునిగాయి. మొక్కజొన్న, సోయా పంట పొలాలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సోమేశ్వర్ దేవునికుంట చెరువులోకి వెళ్లే సాగర్ పిల్ల కాలువ కట్ట తెగిపోవడంతో నీరంతా పంట పొలాల్లో వచ్చి చేరడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొల్లూరు వాగు ఉప్పొంగి రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. సోమవారం కురిసిన భారీ వర్షానికి బాన్సువాడ-బీర్కూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో బీర్కూరుకు వెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు దుర్కి విూదుగా మళ్లించారు. కొల్లూరు గ్రామస్థులు బాన్సువాడ రావడానికి చుట్టూ 5 కిలోవిూటర్లు తిరిగి దుర్కి విూదుగా బాన్సువాడకు చేరుకుంటున్నారు..