త్రిశంకు స్వర్గంలో ఆర్టీసీ కార్మికులు
ధిక్కారమును సహించేది లేదన్న రీతిలో తెలంగాణ సిఎం కెసిఆర్ ఉన్నట్లుగా ఉంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి, ఇక అస్త్ర సన్యాసం చేశారు. కొట్లాడే ఓపిక లేదన్న భావనలో ఉన్నారు. రాజు మొండిగా ఉన్న రాజ్యంలో ఓటమే తప్ప గెలుపు ఉండదు. ఆర్టీసీ కార్మికులకు ఇది అక్షరాలు వర్తిస్తుంది. అందుకే వారు సమ్మెను విరమించుకున్నట్లు ప్రకటించారు. కానీ ఆర్టీసీపై యుద్దం ప్రకటించిన సిఎం కెసిఆర్ మాత్రం ససేమిరా అంటున్నారు. మిమ్మల్ని చేర్చుకునేది లేదని తెగేసి చెప్పారు. దీంతో ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల పరిస్థితి త్రిశంకు స్వర్గంలో పడింది. తిండీ తిప్పలు లేక అనేక వేల కార్మిక కుటుంబాలు రెండు నెలలుగా రోడ్డున పడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వారి బతుకులు ఎలా ఉంటాయన్నది ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే అనేక గుండెలు ఆగాయి. అనేకమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఈ దశలో సర్కార్ నిర్ణయంతో మరెంతమంది బలవుతారో అన్న ఆందోళన కలుగుతోంది. అయితే ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. నా మాట వినకుంటే అంతే సంగతులు..మిమ్మల్ని శంకరిగిరి మాన్యాలు పట్టిస్తా అన్న రీతిలో పాలకులు భీష్మించుకు కూర్చున్నారు. సమ్మె విరమించినా ఉద్యోగంలో చేరే భాగ్యం లేకపోవడం అన్నది ఇదే తొలిసారి కానుంది. మొత్తంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల జీవితాలు ఆగమైపోతున్నాయి. ఈ పరిస్థితికి ఎవరు కారణం అంటే అందరూ కారణమే. నవరవర నీచే నాచే వరమడిగిన కుంతిచేత…వాసవుచేతన్…కర్ణుడీలిగే ఆరుగురి చేతన్..అన్నట్లుగా ఆర్టీసీ కార్మికులు అందరి కారణంగా ఆకలి చావులకు సిద్దం కావాల్సిందే. వారికి బలిదానం తప్పమరో మార్గం లేకుండా పోయిందని చెప్పాల్సిందే. ప్రభుత్వం…కార్మిక సంఘాల నాయకులు.. ప్రతిపక్షాలు.. చివరకు హైకోర్టు కూడా వారిని కాపాడలేకపోయింది. ప్రభుత్వం నిర్దయ కారణంగా ఇప్పటికే కొంతమంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోగా, మరికొందరు గుండెపోటుతో చనిపోయారు. 52రోజులపాటు కడుపు కాల్చుకుని సమ్మె చేసిన కార్మికులకు ఇప్పుడు ఉద్యోగ భరోసా కూడా లేకుండా పోయింది. ఉద్యోగంలో చేరడం అన్నది ఇక అసాధ్యమని తేలిపోయింది. ఆర్టీసీ చరిత్ర ముగిసిన కథ ఆనాడే ప్రకటించిన సిఎం కెసిఆర్ ఆ మేరకు చర్యలకు సిద్దంగా ఉన్నారు. కార్మికులు చస్తే నాకేంటి అన్న ఆయన ధోరణిలో ఆయన ఉన్నారు. సొంత రాష్ట్రం ఏర్పడితే బంగారు భవిష్యత్తు ఉంటుందని నమ్మబలికిన ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సం ఆర్టీసీకి మనుగడే లేకుండా చేస్తున్నారు. తన మాట వినకుండా సమ్మె చేయించిన కార్మిక నాయకులపై ఆగ్రహంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని నడపలేమని తేల్చిచెప్పారు. ఆనాడు ఉద్యమ నాయకత్వం వహించిన నేటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు నేడు మౌనాన్ని ఆశ్రయించారు. సమ్మె విరమించాం..విధుల్లో చేరుతాం… బేషరతుగా విధుల్లోకి తీసుకోవలసిందిగా కార్మిక నాయకులు ప్రాధేయపడుతున్నా ప్రభుత్వ పెద్దల మనస్సు కరగడంలేదు. కార్మికుల పట్ల సానుభూతి ఉన్న అధికార పార్టీ నాయకులు కూడా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు భయపడి నోరు మెదపడం లేదు. ఓట్ల కోసం వేల కోట్లతో పథకాలు ప్రవేశ పెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు ఆర్టీసీని నడపడానికి అవసరమైన కొన్ని వందల కోట్ల రూపాయలను కూడా ఇవ్వలేమని చెతులెత్తేసారు. దీంతో వారు ఏం చేయాలో కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సమ్మె వల్ల కలిగిన నష్టంమాటెలా ఉన్నా మొత్తం జీవితాలకే ఎసరు వచ్చింది. బతకడమెలాగా అన్నది ఇప్పుడు వారిముందున్న ప్రశ్న. కేంద్రం కూడా చూసీచూడనట్లుగా ఉంది. సమ్మెలోకి దిగిన కార్మికుల భుజంపై తుపాకీ పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దెబ్బతీయాలని భావించిన ప్రతిపక్షాలు ఇప్పుడు
చేతులు ఎత్తేశాయి. కార్మికులను రెచ్చగొట్టిన ప్రతిపక్షాలు క్రమంగా బాధ్యత నుంచి తప్పుకొన్నాయి. సమ్మె
ప్రారంభంలో కార్మికులలో ఆశలు చిగురింపజేసిన హైకోర్టు కూడా చివరకు చేతులెత్తేసింది. మేధావులు కూడా ఏవిూ చేయలేకపోతున్నారు. సమైక్య రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఏనాడూ ఉత్పన్నం కాలేదు.స్వీయ పాలన వస్తే తమ జీవితాలు మరింత బాగుపడతాయన్న ఉద్దేశంతో ఆర్టీసీ కార్మికులు కూడా సకల జనుల సమ్మెలో పాల్గొని తమ వంతు పాత్ర పోషించారు. మొత్తం విూద ఇప్పుడున్న పరిస్థితుల్లో సిఎం కెసిఆర్ చెప్పినట్లుగా ఆర్టీసీ కాలగర్భంలో కలసిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. సుదీర్ఘ పోరాటం తర్వాత సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం అత్యంత విషాదమని చెప్పవచ్చు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆజంజాహి మిల్లు తదితర అనేక సంస్థలకు పునరుజ్జీవనం వస్తుందని భావించిన తెలంగాణ ప్రజలకు, అవి తెరుచుకోవడం కాదు..ఉన్న ఆర్టీసీ తలుపులు మూసుకుని పోతున్నాయన్న బాధ కలుగు తోంది. పాలకుల్లో దూరదృష్టి, ప్రజల పట్ల సానుభూతి లేకపోవడం ఈ పర్యవసానాలకు కారణంగా చూడాలి. సంక్షేమం పేరిట అడ్డగోలుగా ప్రజాధనాన్ని పంచిపెడుతున్న పాలకులు.. సామాజిక బాధ్యతల నుంచి తప్పుకొంటున్నారు. దీంతో ఆర్టీసీ కథ కంచికి చేరడం దాదాపు ఖౄయంగా కనిపిస్తోంది. ప్రజా రవాణా నుంచి తప్పుకోవడం అన్నది ప్రజలపై భారం మోపే ప్రక్రియగానే చూడాలి. దీంతో ప్రైవేట్ ఆపరేటర్ల చేతికి జుట్టు ఇచ్చినట్లు అవుతుంది. దీనిని గమనించకపోవడం మనద దౌర్భాగ్యంగా చూడాలి. ఏదేమైనా రానున్న రోజుల్లో కార్మికుల భవితవ్యం ఏమిటన్నది శేషప్రశ్నగా మిగిలిపోరాదని కోరుకుందాం.