త్వరలో కార్మికులకు రూ.700 కోట్ల లాభాల బోనస్ చెల్లింపు.

-ఐదేళ్ల లో 12 కొత్త గనులు, 100మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి,-రూ.50 వేల కోట్ల టర్నోవర్.
-దేశంలో 200కు పైగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో నెంబర్ వన్గా సింగరేణి.
-పోటీ మార్కెట్లో నిలబడాలంటే ఖర్చులు తగ్గించాలి, ఉత్పాదకత పెంచాలి
-సమష్టిగా పరిశ్రమిస్తే సింగరేణికి మరో వందేళ్ల భవిష్యత్
-స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్
దేశంలో గల దాదాపు 200కు పైగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో కెల్లా అత్యద్భుత ప్రగతితో సింగరేణి సంస్థ పురోగమిస్తూ దేశ సేవకు అంకితమై పనిచేస్తోందని, ఇకపై కూడా ఇదే ఒరవడితో పనిచేస్తూ వచ్చే ఐదేళ్ల లో 12 కొత్త గనులు, 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, రూ.50 వేల కోట్ల టర్నోవర్ సాధించే లక్ష్యంతో ముందుకుపోతోందని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ వెల్లడించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో మంగళవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతకాన్ని ఎగురవేసిన తర్వాత ఉద్యోగులను ఉద్దేశించి సందేశం ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో గత 9 సంవత్సరాల్లో దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థ సాధించని టర్నోవర్ ను, లాభాలను గడించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాక పూర్వం 2013-14 లో కేవలం 419 కోట్ల రూపాయల లాభాలను మాత్రమే సాధించిన సింగరేణి గత ఏడాది 2,222 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిందన్నారు. అలాగే తెలంగాణ రాక ముందు సంవత్సరం కార్మికులకు 83 కోట్ల రూపాయలను లాభాల బోనస్గా చెల్లించగా.. ఈ ఏడాది 700 కోట్ల రూపాయల లాభాల బోనస్ను త్వరలోనే కార్మికులకు చెల్లించబోతున్నామన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఇటీవల శాసనసభలో సింగరేణి సంస్థ ప్రగతిని ప్రశంసించడమే కాక కార్మికులకు లాభాల బోనస్, దీపావళి బోనస్ కలిపి వెయ్యి కోట్ల రూపాయలను చెల్లిస్తున్నట్లు ప్రకటించారని, ఆయన ఆదేశానుసారం దసరా పండుగకు ముందే 700 కోట్ల రూపాయల లాభాల బోనస్ ను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
దేశ ఇంధన అవసరాలరీత్యా నేడు ప్రైవేట్ కంపెనీలు కూడా బొగ్గు ఉత్పత్తిలోకి వస్తున్నాయని, రానున్న రెండుమూడేళ్లలో ప్రైవేట్ ఉత్పత్తి దారులతో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే ఉత్పత్తి ఖర్చును తగ్గించుకోవాలని, పూర్తి పనిగంటలు వినియోగిస్తూ ఉత్పాదకత పెంచుకోవాలని, అలాగే నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, అప్పుడే మన వినియోగదారులు మనతో ఉంటారని పేర్కొన్నారు.సింగరేణి మనుగడను దృష్టిలో ఉంచుకొని వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా సింగరేణి సంస్థ నెలకొల్పిన 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పవర్ ప్లాంట్లలో నెంబర్-1 స్థానంలో ఉందన్నారు. అదే ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల ప్లాంట్ ను కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత 300 మెగావాట్ల సోలార్ పవర్కు అదనంగా మరో 240 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను మరో ఏడాది లోగా ఏర్పాటు చేసి మొత్తం 540 మెగావాట్ల సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేయనున్నామని తెలిపారు. దీంతో సింగరేణి సంస్థ తన థర్మల్, సోలార్ ప్లాంట్ల నుండి 2,540 మెగావాట్ల విద్యుత్ను రాష్ట్రానికి అందించబోతుందన్నారు.అలాగే రానున్న ఐదేళ్ల లో 12 కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళికలు సమర్పించామని, వీటిలో నాలుగు ప్రాజెక్టులను ఈ ఏడాది డిసెంబరులో ప్రారంభించబోతున్నామన్నారు. 2029-30 నాటికి సింగరేణి వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మైలు రాయిని దాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కనుక ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ ఉత్పాదకత పెంచాలని, నాణ్యతపై శ్రద్ధ చూపాలన్నారు.జీఎం(కో ఆర్డినేషన్) ఎం.సురేశ్కు మరో ముగ్గురికి సన్మానంగత మూడున్నర దశాబ్దాలుగా వివిధ ఏరియాల్లో జీఎంగా పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేసిన ప్రస్తుతం జనరల్ మేనేజర్(కో ఆర్డినేషన్) ఎం.సురేశ్ను సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ ఘనంగా సన్మానించారు. అలాగే లైజన్ అండ్ ప్రొటోకాల్ ఆఫీసర్ ఎస్.హరినాథ్, ఎన్సీడబ్ల్యుఏ ఉద్యోగుల నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీమతి కరుణశ్రీ , ఆఫీస్ అటెండెంట్ కొప్పుల సాయిబాబాను సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ సన్మానించారు.ఈ కార్యక్రమంలో అడ్వైజర్లు డి.ఎన్.ప్రసాద్(మైనింగ్), సురేంద్ర పాండే(ఫారెస్ట్రీ), ఈడీ(కోల్ మూమెంట్) జె.అల్విన్, జీఎం(కో ఆర్డినేషన్) ఎం.సురేశ్, జీఎం(మార్కెటింగ్) జి.దేవేందర్, అడ్వైజర్ (లా) లక్ష్మణ్రావు, సీఎంవోఏఐ జనరల్ సెక్రెటరీ శ ఎన్.వి.రాజశేఖరరావు, సేవా అధ్యక్షురాలు శ్రీమతి ఆశా సురేశ్ తదితరులు పాల్గొన్నారు.స్వరాష్ట్రంలోనే సింగరేణి సంస్థ అద్భుత ప్రగతి : జనరల్ మేనేజర్(కో ఆర్డినేషన్) ఎం.సురేశ్
సింగరేణి సంస్థ 13 దశాబ్దాల క్రితమే ఆవిర్భవించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత యువ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ ప్రతిభావంత నాయకత్వంలోనే చరిత్రలో ఎన్నడూ సాధించని వృద్ధిని సాధించిందని, దేశంలో ప్రభుత్వ రంగం సంస్థల్లో నెంబర్ -1 గా నిలిచిందని, ఇదే స్ఫూర్తితో దేశ సేవకు పునరంకితం కావాలని జనరల్ మేనేజర్(కో ఆర్డినేషన్) ఎం.సురేశ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో మధ్యాహ్నం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుక కార్యక్రమంలో మాట్లాడారు. సింగరేణి సంస్థకు ఇది స్వర్ణ యుగం లాంటిదని, ప్రతీ ఉద్యోగి తమ వంతు బాధ్యతను నిర్వహిస్తూ సంస్థ ఉన్నతికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా జీఎం(మార్కెటింగ్) జి.దేవేందర్, సీఎంవోఏఐ జనరల్ సెక్రటరీ ఎన్.వి.రాజశేఖరరావు మాట్లాడారు. సేవా అధ్యక్షురాలు శ్రీమతి ఆశా సురేశ్, సింగరేణి భవన్ లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-( ప్రత్యేక ప్రతినిధి /జనం సాక్షి )

తాజావార్తలు