థరూర్‌ను మెంటల్‌ ఆస్పత్రికి పంపాలి: స్వామి

న్యూఢిల్లీ,జూలై12(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ మానసిక పరిస్థితి సక్రమంగా ఉన్నట్లు లేదని, ఆయనకు వైద్య చికిత్స అవసరమని బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి అన్నారు. అవసరమైతే మెంటల్‌ హాస్పిటల్‌కు పంపించండని స్వామి అన్నారు. 2019లో భాజపా విజయం సాధిస్తే.. ఓ రకంగా హిందూ పాకిస్థాన్‌ ఏర్పాటయ్యే పరిస్థితులు తలెత్తుతాయని శశిథరూర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై భాజపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్వామి స్పందిస్తూ థరూర్‌ను అవసరమైతే మెంటల్‌ హాస్పిటల్‌కు పంపించాల్సిందిగా సూచించారు. థరూర్‌ చాలా ఒత్తిడికి లోనవుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. అసలు హిందూ పాకిస్థాన్‌ అర్థం ఏమిటి? ఆయన ఏ అర్థంతో అన్నారు? ఆయన పాకిస్థాన్‌కు వ్యతిరేకా? లేదా.. ప్రధాని మోదీని తొలగించేందుకు పాకిస్థాన్‌ ప్రధాని సాయం కోరుతున్నారా? అసలే ఆయనకు పాకిస్థాన్‌లో గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు. వారంతా ఐఎస్‌ఐ వాళ్లే’ అని స్వామి చురకలు వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా గెలిస్తే మాత్రం మన ప్రజాస్వామ్యయుత రాజ్యాంగం యథాతథంగా మనుగడ సాగించడం కష్టమని థరూర్‌ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా ఖండించింది. థరూర్‌ చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందిగా పలువురు భాజపా నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.