దండెపల్లిలో ఎగిసిపడ్డ కన్నీటి కెరటం
– గూడ అంజయ్యకు తుది వీడ్కోలు
ఆదిలాబాద్ ,జూన్ 22(జనంసాక్షి):ప్రముఖ తెలంగాణ కవి, రచయిత గూడ అంజయ్య అంత్యక్రియలు ముగిశాయి. ఆయన స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా లింగాపురంలో అంజయ్య అంత్యక్రియలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన అభిమానులు అశ్రునయనాల నడుమ తుది వీడ్కోలు పలికారు. అంజన్న అమర్ రహే నినాదాలతో లింగాపురం మారుమోగింది.అంతకుముందు అంజయ్య భౌతికకాయం దగ్గర ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు రాజయ్య, దివాకర్ రావు, రామలింగారెడ్డి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో గూడ అంజయ్య రాసిన పాటలు వెన్నుదన్నుగా నిలిచాయన్న నేతలు.. ఆయన ఆశయాలను సాధిస్తామన్నారు.ప్రజల వాణిని తమ పాటలో వినిపించిన అంజన్న జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు సినీ దర్శకుడు ఆర్. నారాయణమూర్తి. అంజయ్య భౌతికకాయానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు.దండేపల్లి మండలాన్ని గూడ అంజయ్య మండలంగా ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్ తో మాట్లాడుతామని నేతలు హావిూ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ప్రజాకవి, సాహితీవేత్త, అభ్యుదయ వాది తన పాటలు, రచనలతో పల్లె ప్రజలను చైతన్యపరిచిన గూడ అంజయ్య (62) మంగళవారం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన భార్య హేమనళిని, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అంజయ్య మృతి అభ్యుదయవాదులను, కవులను, మేధావులను, సాహితీప్రియులను తీవ్రంగా కలిచివేసింది. అంజయ్య ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో గూడె లక్ష్మమ్మ-లక్ష్మయ్య దంపతులకు 1955లో 4వ కుమారుడిగా జన్మించారు. స్థానిక పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించి హైస్కూల్ చదువు లక్షెట్టిపేట – సాంఘిక సంక్షేమ వసతిగృహంలో పూర్తి చేశారు. పై చదువులకు హైదరాబాద్‌కు వెళ్ళారు. ఇంటర్మీడియట్ చదువుతుండగా అభ్యుదయభావాలు గల అంజయ్య విప్లవాల పట్ల ఆకర్షితుడై ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారు. ఆయన రచనలు పల్లె ప్రజల జీవితాలను ప్రభావితం చేసి చైతన్యపరిచాడు. తెలంగాణ బ్రతుకు చిత్రాన్ని గేయాల్లో రాసిన కవి, ఉద్యమకారుడు గూడ అంజయ్య 1975 ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో దొరలు, పెత్తందార్ల దోపిడీని ఎండగట్టడం కోసం రచించిన పాట ” ఈ ఊరు మనదిరా… ఈ పల్లె మనదిరా…” యావత్ పీడిత ప్రజలకు మనోఃధైర్యాన్ని తన పాటల ద్వారా నింపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఫార్మాసిస్టుగా పని చేస్తూ ఉట్నూర్‌లో ఇల్లు నిర్మించుకొని సాహితీసేవకు అధిక సమయం కేటాయించారు. 1970లో అరుణోదయ సాంస్కృతిక సంస్థ, జయ నాట్యమండలిలో పని చేస్తూ పాటలు రాసి ఈ సంస్థ ద్వారా తన రచనలను ప్రజల్లోకి తీసుకెళ్ళారు. ఉట్నూర్‌లో ఉంటున్న ఆయనను సినీ దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ప్రోద్భలంతో సినీరంగంలో ప్రవేశించి హైదరాబాద్‌కు మకాం మార్చారు. తెదేపా ప్రభుత్వానికి జన్మభూమి కార్యక్రమం కోసం పాటలు రచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అంజయ్య సేవలను గుర్తించి దళిత సేవారత్న, ప్రజాకవి, దళితరత్న అవార్డులతో సత్కరించింది. అభ్యుదయ భావాలు కలిగిన అంజయ్య బ్రతికినంతకాలం ఆడంబరాలకు వెళ్ళకుండా సాదాసీదా జీవితాన్ని అనుభవించారు. అంజయ్యకు ఉన్న ఆస్తులు దేశ ప్రజలే. హైదరాబాద్‌లో మృతి చెందిన అంజయ్య భౌతికఖాయాన్ని స్వగ్రామంలో బుధవారం ప్రజల సందర్శార్ధం ఇంటి వద్ద ఉంచారు. ప్రజాయుద్దనౌక గద్దర్, సినీ నిర్మాత ఆర్.నారాయణమూర్తి, ఎంపి బాల్క సుమన్, ఎంఎల్‌ఎ దివాకర్‌రావు, జిల్లా చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, కవులు, 10 జిల్లాల కళాకారులు, మేధావులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సిపిఐ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు రాములు, టిబిజికెఎస్ నాయకులు కెంగర్ల మల్లయ్య, సింగరేణి జెఎసి నాయకులు ఎండి.మునీర్, ఎస్‌సి, ఎస్‌టి సెల్ రాష్ట్ర కన్వీనర్ శామ్యూల్, తెవివే జిల్లా నాయకులు గురిజాల రవీందర్, కాంగ్రెస్ నాయకులు హరినాయక్, సిఐటియు నాయకులు కె.అశోక్, పోతు శంకర్, తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు కుర్సెంగ వెంకటేశ్వర్లు, నాయక్‌పోడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.భీంరావు, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి నాయకులు రాజలింగం, తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి అంజయ్య అభిమానులు పాల్గొని అంజయ్య అమర్‌హై అంటూ నినాదాలు చేశారు.
ప్రజాయుద్దనౌక గద్దర్
ప్రజాకవి అంజయ్య నిత్యం పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తూ తన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చిన పేద ప్రజల అభివృద్ధికి తన పాటల ద్వారా బాటలు వేసిన గొప్ప వ్యక్తి, గొప్ప అభ్యుదయవాది, రచయిత అంతే కాకుండా ఆనాటి దొరల పాలనలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పాటలు పాడుతూ రచనలు రాసి ప్రజలందరినీ ఒక తాటిపైకి తెచ్చిన అభ్యుదయ వాదుల్లో అంజయ్య ఒకరు. అంతే కాకుండా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం, ఉద్యోగం లాంటివి ఆశించకుండా కుటుంబ సభ్యుల కోరిక మేరకు దండేపల్లి మండలాన్ని గూడఅంజయ్య మండలంగా నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం అంజయ్య మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆర్.నారాయణమూర్తి, సినీ నిర్మాత
పేద ప్రజల పక్షాన తన పాటలు, రచనలతో పోరాటం చేసిన గూడ అంజన్న దేశ ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోతారని అన్నారు.
బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపి
ఉద్యమాల్లో అంజన్న సేవలు మరువలేనివని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ పాటలతో, రచనలతో ఉద్యమానికి పురుడు పోసిన అంజన్న నేడు ప్రజల గుండెల నుంచి దూరమైనందుకు లింగాపూర్ గ్రామ వాసులకు అంజన్న చిరస్థాయిగా నిలిచిపోతారని, ఆయన పాటలు ఉన్నంత వరకు అంజన్న ప్రజల గుండెల్లో ఉంటాడని అన్నారు. అనంతరం అంజయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.