దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో భారీ భూకంపం


రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.1 గా నమోదు
వనువాటు,ఆగస్ట్‌18(జనంసాక్షి): దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలోని ద్వీప దేశం అయిన వనువాటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూప్రకంపనల తీవ్రత 7.1 గా నమోదు అయ్యింది. భూకంపం తీవ్రత కారణంగా సునామీ వచ్చే ఛాన్స్‌ ఉందని యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే ప్రకటించింది. సమీప ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీర ప్రాంతాలను సముద్ర అలలు ముంచెత్తే ప్రమాదం ఉందని ప్రకటించింది. యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే ప్రకారం.. వనువాటులోని సన్మా ప్రావిన్స్‌లోని పోర్ట్‌-ఓల్రీ, లుగాన్‌విల్లే సమీపంలో స్థానిక కాలమాన ప్రకారం ఆగస్టు 18న రాత్రి 9.10 గంటలకు 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం పోర్ట్‌-ఓల్రీకి 20 కిలోమీటర్ల దూరంలో, లూగాన్‌విల్లేకి 71 కిలోమీటర్ల దూరంలో, సోలా కు 134 కిలోమీటర్ల దూరంలో, నార్సప్‌ కు 137 కిలోమీటర్ల దూరంలో, లకాటోరో కు 141 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే అధికారులు వెల్లడిరచారు. అలాగే, భూకంప కేంద్రం 91 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపారు. కాగా, ఇక ఆస్ట్రేలియా జియోసైన్స్‌ ప్రకారం.. భూకంప తీవ్రత 6.7గా నమోదు అయ్యింది. ప్రాన్స్‌ దేశానికి చెందిన రేసో నేషనల్‌ డి సర్వైలెన్స్‌ సిస్మిక్‌ 6.4 తీవ్రత నమోదైనట్లు ప్రకటించింది. ఇండియోనేషియా వాతావరణ కేంద్రం 6.8 తీవ్రత నమోదైనట్లు పేర్కొంది. యూరోపియన్‌-మధ్యదరా భూకంప కేంద్రం, జర్మన్‌ పరిశోధన కేంద్రం 6.8 గా పేర్కొన్నాయి. అయితే, సాధారణంగా భూకంపాల తీవ్రతను చాలా ఏజెన్సీలు నమోదు చేస్తాయి. ఆయా ఏజెన్సీల్లో ఆయా రిజల్ట్స్‌ చూపుతాయి. మొదటి నివేదిక కంటే.. తరువాత వచ్చే నివేదికల్లో ఖచ్చితత్వం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దక్షిణ పసిఫిక్‌ మహాసముద్ర దేశం అయిన ఈ వనౌతు.. 80 దీవుల సమూహం. ఇది 1,300 కిలోమీటర్లు విస్తరించి ఉంది. పగడపు దిబ్బలతో ఈ ద్వీపాలు ఏర్పడడ్డాయి. ఈ దేశం పర్యాట ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. నీటి అడుగున గుహలు, తదితర ఆసక్తికర ప్రదేశాలు ఈ ప్రాంతంలో ఉంటాయి. ఈ దేశ రాజధాని, ముఖ్య ఆర్థిక కేంద్రం పోర్ట్‌ విలా.