దయానిధి మారన్‌కు బెయిల్‌ రద్దు

2

చెన్నై,ఆగస్ట్‌10(జనంసాక్షి):అనధికార టెలిఫోన్‌ ఎక్స్‌ చేంజ్‌ కేసులో కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నాయకుడు దయానిధి మారన్‌ కు మద్రాస్‌ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన ముందస్తు బెయిల్‌ ను రద్దు చేసిన కోర్టు, మూడు రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. మారన్‌ ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని గత నెలలో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దయానిధికి సహకరించకూడదని మద్రాస్‌ హైకోర్టుని కోరింది. యూపీఏ-1 హయాంలో 2004-2007 మధ్య దయానిధి మారన్‌ కేంద్ర టెలి కమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో తన సోదరుడైన కళానిధి మారన్‌ కు 300 హైస్పీడ్‌ టెలిఫోన్‌ లైన్లను అక్రమంగా మంజూరు చేశారు. వాటిని కళానిధి సన్‌ టీవీ కార్యక్రమాలను అప్‌ లింక్‌ చేయడానికి ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.