దళితబంధుతో కాంగ్రెస్‌, బిజెపికు దడ

పథకాలు పట్టాలకు ఎక్కుతుంటే నిద్ర పట్టడం లేదు
కొత్తగూడెం,ఆగస్ట్‌16(జనంసాక్షి): దళితబంధు ప్రకటనతో కాంగ్రెస్‌, బిజెపిలకు వణుకు పుడుతోందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేవ్వర రావు అన్నారు. గతంలో ఎవ్వరూ కెసిఆర్‌ లాంటి సాహసం చేయలేదన్నారు. అందుకే వారికి దిక్కుతోచడం లేదన్నారు. రకరకాల విమర్శుల చేస్తున్నారని అన్నారు. అయినా పట్టుదలతో సిఎం కెసిఆర్‌ దీనిని పట్టాలకు ఎక్కిస్తున్నారని అన్నారు. అలాగే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే వారికి నిద్ర పట్టడం లేదని విమర్శించారు. ఆనాటి కమిషన్ల వ్యవహారం గురిగించి ప్రపంచమంతా కోడై కూసిందన్న విషయం మరచి పోరాదన్నారు. గతంలో సిఎం కెసిఆర్‌ అసెంబ్లీ వేదికగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తే నోళ్లు వెల్లబెట్టిన నేతలు డుమ్మాకొట్టారని అన్నారు. కాళేశ్వరం పూర్తి కావడంతో ఎక్కడ తమకు పుట్టగతులు ఉండవో అన్న బెంగ కాంగ్రెస్‌,బిజెపి నేతలను వేధిస్తోందని అన్నారు. ఇందిరాసాగర్‌, రుద్రంకోట ప్రాజెక్టు నిర్మిత ప్రదేశం ఆంధ్ర పరిధిలోకి వెళ్లిందని, అక్కడ హెడ్‌వర్క్స్‌ పైపులైన్‌ నిర్మించాలంటే ఆ రాష్ట్ర అనుమతి అవసరం తప్పనిసరి అని చెప్పారు. ఈ పరిస్థితిని గ్రహించే సీఎం కేసీఆర్‌ దుమ్ముగూడెం రీడిజైన్‌ చేయించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని తెలిపారు. ప్రస్తుతం అన్ని పంపుహౌస్‌ పనులూ చురుగ్గా సాగుతున్నాయని, అనుమతులు కూడా వస్తున్నాయని వెల్లడిరచారు.
ఇకపోతే మిషన్‌ భగీరథ పనులను నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేసి ఇంటింటింకీ మంచినీరు అందిస్తామని కొత్తగూడెం ఎమ్మెల్యే అన్నారు. సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. ఇంటింటికి తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. జిల్లాలో మిషన్‌ భబగీరధ పనులను వేగవంతం చేసి గడువులోపూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పలుచోట్ల మిషన్‌ భగీరథ పనులను ఆయన నీటిపారుదలశాఖ, విద్యుత్‌శాఖ అధికారులతో కలిసి పరిశీలించాక పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథ పనులు చురుకుగా జరుగుతున్నాయని గడువులోపు పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు.