దళితబంధు ప్రారంభించిన గ్రామంలో టిఆర్‌ఎస్‌ ఢమాల్‌

శాలపల్లిలో 135 ఓట్ల ఆధిక్యంలో నిలిచిన ఈటెల రాజేందర్‌
కెసిఆర్‌ పాచిక పారలేదంటున్న విశ్లేషకులు
పోస్టల్‌ బ్యాటెల్‌లో మాత్రం టిఆర్‌ఎస్‌కు భారీ ఆధిక్యత
హుజూరాబాద్‌,నవంబర్‌2జనంసాక్షి : హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఎంతో ఆసక్తిగా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావించిన టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని ప్రకటించారు. ఈ పథకాన్ని ముందుగా ఎన్నికల సంగ్రామమైన హుజూరాబాద్‌ నుంచే మొదలు పెట్టారు. ఈ పథకంతో దళితుల ఓట్లు తమకే వస్తాయని కేసీఆర్‌ భావించారు. అయితే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు ప్రారంభించిన శాలపల్లి గ్రామంలోనే టీఆర్‌ఎస్‌కు ఆదరణ కరువైంది. శాలపల్లిలో సీఎం కేసీఆర్‌ సభ కూడా పెట్టారు. అయినా శాలపల్లి ఓటర్లను టీఆర్‌ఎస్‌ ఆకర్షించలేకపోయింది. శాలపల్లిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 135 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక మొదటి రౌండ్లో పోతిరెడ్డి పేట, వెంకట్రావు పల్లి, చెల్పూర్‌, ఇందిరా నగర్‌, రాజపల్లి, సిరసపల్లితో పాటు శాలపల్లికి సంబంధించిన ఓట్లను కూడా లెక్కించారు. అయితే దళితబంధు ప్రకటించిన శాలపల్లిలోనే టీఆర్‌ఎస్‌కు తక్కువ ఓట్లు రావడంతో దళితబంధు లబ్దిదారులు షాకిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్‌ వేసిన పాచిక పారలేదని అంటున్నారు. ఇదిలావుంటే పోస్టల్‌ బ్యాలెట్‌లో మాత్రం టిఆర్‌ఎస్‌ ఆధిక్యం చూపింది. హుజురాబాద్‌ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుతో మొదలైంది. కొద్దిసేపటి క్రితమే ఈ లెక్కింపు పక్రియ పూర్‌ఖ్తెంది. పోస్టల్‌ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 753 పోస్టల్‌ బ్యాలెట్లకు గాను టీఆర్‌ఎస్‌కు 503 ఓట్లు, బీజేపీకి 159 ఓట్లు, కాంగ్రెస్‌కు 35 ఓట్లు పోలవగా, చెల్లనివి 14 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి అవడంతో ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 22 రౌండ్లలో హుజరాబాద్‌ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పూర్తి ఫలితం వెలువడనుంది. కాగా విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం విధించింది. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో 86.64 శాతం పోలింగ్‌ నమోదు అయిన విషయం తెలిసిందే.