దళితబంధు సభా వేదిక ఏర్పాట్ల పరిశీలన
16న జరిగే సభాప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు
లక్షా 20వేల మందితో దళితబంధు సభ నిర్వహణ
దళితప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానాలు
కెసిఆర్ చేతుల విూదుగా 2వేల మందికి చెక్కుల పంపిణీ
వివరాలు వెల్లడిరచిన మంత్రి కొప్పుల ఈశ్వర్
హుజూరాబాద్,అగస్టు12(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు కార్యక్రమాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 16న లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని శాలపల్లిలో సీఎం బహిరంగ సభాస్థలిని మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ గురువారం ఉదయం పరిశీలించారు. అనంతరం అధికారులతో సభా ఏర్పాట్లపై మంత్రులు సవిూక్షించారు. సభా నిర్వహణకు సంబంధించి అధికారులకు మంత్రి హరీశ్‌రావు పలు సూచనలు చేశారు. ఇక టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. జమ్మికుంట వేదికగా జరగబోయే దళిత బంధు సభా వేదిక ఏర్పాట్లపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. 16వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల విూదుగా దళిత బంధు కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. ఆ రోజున 2 వేల మందికి దళిత బంధు చెక్కులను పంపిణీ చేసి, మరుసటి రోజు నుంచి మరో 20 వేల మందికి పంపిణీ చేస్తామన్నారు. ఈ సభకు లక్షా 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున.. అందరికీ భోజనం, మంచినీళ్ల సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సభకు దళితులను తీసుకొచ్చేందుకు 825 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. సభను విజయవంతం చేయాలని దళితులకు మంత్రి కొప్పుల విజ్ఞప్తి చేశారు. సభకు దళిత వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఇప్పటికే దళిత బంధుపై దళిత ప్రజాప్రతినిధులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలు కోసం రూ. 500 కోట్లను సీఎం కేసీఆర్ విడుదల చేశారని గుర్తు చేశారు. ఈ పథకాన్ని ఒక ఉద్యమం మాదిరిగా రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని, ఇందుకు సంబంధించి సర్వే పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది 119 నియోజక వర్గాలలో 100 కుటుంబాల చొప్పున సుమారు 12వేల కుటుంబాలకు దళిత బంధును అమలు చేస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.