దళితులపై దాడుల్లో ఏపీయే టాప్
శ్రీకేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి
శ్రీరాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన ముకుల్ వాస్నిక్
హైదరాబాద్, జూన్ 27 : దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దళితులపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని కేంద్ర సాంఘిక న్యాయశాఖమంత్రి ముకుల్‌వాస్నిక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఏపీలోనే ఎక్కువగా నమోదవుతున్నాయని ఆయన అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహాల్‌లో జరిగిన పార్లమెంటరీ స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు ఎంపీలు హజరయ్యారు. ఈ సందర్భంగా వాస్నిక్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి పెండింగ్ కేసులు ఆంధ్రప్రదేశ్‌లో 11శాతం మాత్రమే పరిష్కారమవుతున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం చొరువ చూపాలన్నారు. కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. షెడ్యూల్డుకులాలు, షెడ్యూల్డు తెగలు, వెనుకబడిన తరగతులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, మైనారిటీలు ఇతర అల్పాదాయ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏదైనా సమస్య తలెత్తినప్పుడు చిన్నదిగా ఉన్నప్పుడే పరిష్కరించాలని, అది పెద్దది కాకుండా చూసుకోవాలన్నారు. కుల, మతాలకు అతీతంగా 27లక్షల మంది విద్యార్థులకు ప్రతీ ఏటా రూ.3,500 కోట్ల రూపాయలను ఫీజు రియంబర్స్‌మెంట్ కింద అందజేస్తున్నామన్నారు. ఇందిరా జల ప్రభ ద్వారా 6లక్షల మంది షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రూ.1800 కోట్లు ఖర్చు చేసి కార్యక్రమం చేపట్టామన్నారు. 13 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.1.39 కోట్లను అందించామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా తెల్లకార్డులు ఉన్న 7.5 కోట్ల జనాభాకు 14 లక్షల శస్త్ర చికిత్సలు నిర్వహించామన్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి షెడ్యూల్డు కులాలు, తెగల ఉప ప్రణాళిక అమలు కోసం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మింపేటలో జరిగిన సంఘటన దురదృష్టకరమైనదని, బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల మేర నష్టపరిహరం అందజేశామని చెప్పారు. సమావేశంలో కేంద్ర మంత్రి ముకుల్ వాస్నిక్, మంత్రులు పితాని సత్యనారాయణ, జె.గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఉప సభాపతి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది, జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలు తదితరులు పాల్గొన్నారు.