దళితుల అభ్యున్నతిపై నిర్లక్ష్యం తగదు: కెవిపిఎస్‌

ఒంగోలు,అక్టోబర్‌ 4(జనంసాక్షి):  రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధిని ప్రచార ఆర్భాటంగానే చూస్తోందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకులు అన్నారు. ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎస్‌సి,ఎస్‌టి వర్గాలకు ఆయా నిధుల నుండి 18 శాతానికి పైగా నిధులను కేటాయించాల్సి ఉందన్నారు. కానీ గడచిన ఏడాదిలో కేవలం 8 శాతం మేర నిధులనే కేటాయించి ఆ నిధుల్లో కూడా రూ.4వేల నిధులను పక్కదారి పట్టించారన్నారు. తాజాగా గ్రావిూణ ప్రాంతాల్లో 20 మంది విద్యార్థుల కంటే తక్కువ సంఖ్యతో నడుస్తున్న స్కూల్స్‌ను మూసివేయాలని ప్రభుత్వం మార్గ దర్శకాలు జారీ చేసిందన్నారు. దీని కారణంగా దళిత వాడల్లో పాఠశాలలే అధికంగా మూతపడే పరిస్థితి ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉత్తర్వులతో 5 వేల స్కూల్స్‌ మూతపడనుండగా వాటిలో అధికసంఖ్యలో దళిత వాడల్లో పాఠశాలలే ఉన్నాయన్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధులను న్యాయబద్దంగా కేటాయించకుండా, సంక్షేమం దిశగా ఖర్చుచేయకుండా మోసపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.  దళితవాడల్లో డిగ్రీ వరకు చదువుకుని ఉద్యోగాల కోసం పొట్ట చేతపట్టుకుని తిరుగుతున్న నిరుద్యోగులకు రూ.2వేలు నిరుద్యోగ భృతిని ఎన్నికల హావిూలో చెప్పినట్లుగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దళితుల అభివృద్ధి పేరుతో ప్రభుత్వం రాజకీయం చేయడం మానుకుని వాస్తవికత అభివృద్ధి వైపుగా అడుగులు వేయాలని, అర్హులైన దళితులను ప్రభుత్వ పథకాల ద్వారా ఆదుకోవాలన్నారు.