దళితుల ఇండ్లలో దోమలు కుడుతున్నా.. భరిస్తున్నాం

– వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన యూపీ మంత్రి అనుపమ జైశ్వాల్‌
లక్నో, మే4(జ‌నం సాక్షి ): దళితుల ఇండ్లలో దోమలు కుడుతున్నా.. భరిస్తున్నామని ఉత్తరప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి అనుపమ జైశ్వాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దళితుల దృష్టిని ఆకర్షించేందుకు వారి నివాసాల్లో బస చేయాలని, భోజనం చేయాలని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు యూపీ మంత్రులు దళితుల ఇండ్లలో పర్యటిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. దళితులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని.. కానీ వారి నివాసాల్లో దోమలు కుడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. దోమలు కుట్టినా.. భరిస్తూనే వారి ఇండ్లలో పర్యటిస్తున్నామని చెప్పారు. ఇంకో నాలుగైదు ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉందన్నారు. తాము చేస్తున్న పనిలో తనకు సంతృప్తి ఉందన్నారు యూపీ మంత్రి.
సురేశ్‌ రానా అనే ఓ మంత్రి ఇటీవలే దళితుల ఇంటికి వెళ్లారు. అలీగఢ్‌లోని లోహగఢ్‌లో సడెన్‌గా ఓ దళితుడి ఇంటికి వెళ్లి భోజనం చేశారు. ఫొటోలకు పోజులిచ్చారు. ఆ తర్వాత అడ్డంగా బుక్కయ్యారు. ఆ దళితుని ఇంటికి వెళ్లక ముందే ఆ ఊళ్లో కేటరింగ్‌ చేసే వ్యక్తి దగ్గర అన్ని వంటకాలు వండించుకొని తీసుకెళ్లారు. తందూరీ రోటీలు, పన్నీర్‌, పులావ్‌, గులాబ్‌ జామూన్‌.. ఇలా అన్ని వంటకాలు తీసుకెళ్లి ఆ దళితుని ఇంట్లో కూర్చొని తిని వచ్చేశారు. ఆ వీడియోలు బయటకు రావడంతో యోగి తల పట్టుకున్నారు.
ఇక రాజేంద్ర ప్రతాప్‌ సింగ్‌ అనే మరో మంత్రి అయితే తనకు తాను దేవుడిలా ఫీలయ్యారు. ఆ రాముడు శబరి ఇచ్చిన రేగుపళ్లను తిని ఆమెను ఆశీర్వదించినట్లే.. బీజేపీ నేతలు దళితుల ఇళ్లకు వెళ్లి వాళ్లను ఆశీర్వదిస్తున్నారని ఆయన అన్నారు. ఝాన్సీ జిల్లా గధ్‌మౌ గ్రామంలో ఓ దళితుడి ఇంటికి వెళ్లే ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేనో క్షత్రియున్ని. సమాజం, మత రక్షణ కోసం పనిచేయడం నా రక్తంలోనే
ఉంది. మేం వాళ్ల ఇళ్లకు వెళ్తుంటే ఈ దళితుల ముఖాల్లో ఎంత ఆనందం కనిపిస్తున్నదో చూడండి అని అన్నారు.