దళితుల స్మశాన వాటికను కబ్జా

బషీరాబాద్ జులై 20,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలోని జయంతి కాలనీకి చెందిన దళితుల స్మశాన వాటికను కబ్జా నుండి విడిపించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెల మల్లేశం డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో బాధితులతో కలిసి బషీరాబాద్ తహసిల్దార్ కార్యాలయం ముందు బుధవారం రోజున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశంలో రెవెన్యూ రికార్డు లేకముందు నుండి ఇక్కడ దళితులు స్మశాన వాటిక నిర్వహిస్తున్నారని అన్నారు. సుమారు 100 సంవత్సరాలుగా ఇక్కడ స్మశాన వాటిక నిర్వహిస్తుండగా ప్రస్తుతం వందలాది సమాధులు ఉన్నాయన్నారు. ఈ మధ్యకాలంలో ఈ భూమి తనదంటూ హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఈ స్మశాన వాటికను కబ్జా చేశారు. సమాధులను పూడ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడం విచారకరమని అన్నారు. స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలతోనే బయటి వ్యక్తి ఇలాంటి దురాక్రమణకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల అప్పుడు ఇల్లిల్లు తిరిగే నాయకులకు దళితుల స్మశాన వాటిక కనుమరుగవుతుంటే కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దళితులను ఓటు బ్యాంకుగా వినియోగించుకునే అగ్రకుల ఆధిపత్య పార్టీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ స్మశాన వాటికను కబ్జా నుండి విడిపించి, కంచ ఏర్పాటు చేయాలని, బోరు వేసి గదులు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్మశాన వాటికను దక్కించుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జయంతి కాలనీ వార్డు సభ్యులు మరియు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు బుడగ జంగం వెంకటేష్, మండల నాయకులు పరుశురాం, కమల్, కెవిపిఎస్ మండల అధ్యక్షులు సురేష్, జయంతి కాలనీ నాయకులు ఆర్.పకీరప్ప,నర్సిములు, వి.శంకరప్ప,మల్లేష్, గంగారాం బసప్ప,రామస్వామి, కె.గంగప్ప,మొగులప్ప తదితరులు పాల్గొన్నారు.