దాడుల్ని ఖండించిన ఒబామా

5

న్యూయార్క్‌,జులై 8(జనంసాక్షి):అమెరికాలో నల్లజాతీయులపై జరుగుతున్న దాడులను ఆ దేశ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఖండించారు. పోలీస్‌ శాఖలో జాతివివక్ష భేదాలు సమసిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం చర్మ వర్ణం కారణంగానే నల్ల జాతీయులను వేరు చేస్తే అది వాళ్లను బాధిస్తుందని ఒబామా అన్నారు. అమెరికాలోని నల్లజాతీయులపై పోలీసులు జరిపిన కాల్పులు జాతివివక్షలానే కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. మిన్నెసోటాలో నల్లజాతీయులను పోలీసులు కాల్చి చంపిన ఘటన, దానిని నిరసిస్తూ డల్లాస్‌ లో జరిగిన నిరసన సందర్భంగా పోలీసులను కాల్చి చంపడంపై ఆయన స్పందించారు.అమెరికాలో నల్లజాతీయుల హత్యలను నిరసిస్తూ డల్లాస్‌ లో నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై? కొందరు నల్లజాతీయులు కాల్పులకు పాల్పడ్డారు. దాంతో ఐదుగురు పోలీసులు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఇటీవల అమెరికాలో నల్ల జాతీయలపై వరుస దాడులు జరిగాయి. మిన్నెసోటా, లూసియానాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు నల్లజాతీయులు చనిపోయారు. ఆ కాల్పులకు నిరసనగా పలువురు నల్లజాతీయలు డల్లాస్‌ లో భారీ ఆందోళన చేపట్టారు. అయితే, ఆ నిరసన ప్రదర్శనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కొందరు దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది పోలీసులు గాయపడ్డారు. ముగ్గురు పోలీసులు అక్కడిక్కడే మరణించగా? మరో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు.కాల్పులు జరిపిన వారికోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఇప్పటి వరకు ముగ్గురు అనుమానితులను అరెస్ట్‌ చేశారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. అయితే, డల్లాస్‌ లో చాలా చోట్ల బాంబులు అమర్చినట్లు అదుపులో ఉన్న వారు? బెదిరించినట్లు భద్రతా బలగాలు చెప్తున్నాయి. దాంతో డల్లాస్‌ కు విమాన సర్వీసులను నిలిపివేశారు. ఈ ఘటనలో మిగిలిన నిందితుల కోసం వేట కొనసాగుతోంది. దాడికి పాల్పడ్డవారిగా భావిస్తున్న కొందరి చిత్రాలను విడుదల చేశారు.