దిగొచ్చిన అధికారులు… ఆమరణ దీక్ష విరమణ

కలెక్టరేట్‌, జనంసాక్షి: ఆమరణ నిరాహారదీక్షకు దిగి ఆ కుటుంబానికి కాస్తంత ఊరట లభించింది. అధికారులు స్పందించి న్యాయం చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. బాలిక సంరక్షణ పథకానికి అన్ని అర్హతలు ఉన్నా… ఐసీడీఎస్‌ అధికారులు, సిబ్బంది వేధింపులు భరించలేక రామడుగు మండలం దేశరాజ్‌పల్లికి చెందిన ఎడమ శ్రీనివాస్‌రెడ్డి కుటుంబం గురువారం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఓరోజు గడిచాక చూద్దాంలే అనుకున్నారో ఏమో అధికారులు బాధిత కుటుంబం శుక్రవారమూ దీక్ష కొనసాగించడంతో స్పందించారు. మొదట దీక్షచేస్తున్న కుటుంబ సభ్యులను అధికారులు చూసివెళ్లారు. ఎలాంటి హామీ ఇవ్వలేదు. తర్వాతా ఏమైందో ఏమో సాయంత్రం 6.30 నిమిషాలకు తిరిగి దీక్షాశిబిరం వద్దకు అధికారులు చేరుకున్నారు.

బాధితుడు శ్రీనివాసరెడ్డిని సముదాయించారు. గ్రామపంచాయితీ సమక్షంలో జీసీపీ పథకంలో జరిగిన అవకతకలపై వారంలోగా విచారించి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని ఆర్డీవో సంధ్యారాణి ఐసీడీఎస్‌ పీడీ రాములు సమక్షంలో హామీ ఇచ్చారు. పోలీసు కేసు విషయమై డీఎస్పీతో మాట్లాడతానని పేర్కొన్నారు. న్యాయం జరుగుతుందని స్సష్టమైన హామీ ఇవ్వడంతో బాధితర కుటుంబం ఆమరణదీక్ష విరమించింది. అయితే పత్రికల్లో వచ్చిన కథనానికి ఐసీడీఎస్‌ పీడీ రాములు స్పందించారు. శ్రీనివాస్‌రెడ్డి సీడీపీవో కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వకపోవడంతోనే బాలిక సంరక్షణ పథకం మంజూరు కాలేదని వివరణ ఇచ్చారు. ఇద్దరు కుమారైల వయసు మూడేళ్లు దాటిన తర్వాత శ్రీనివాసరెడ్డి ప్రజావాణిలో మాత్రమే దరఖాస్తు చేశాడని తెలిపారు. గ్రామంలో ముగ్గురు పిల్లలున్న వేల్పుల వెంకటికి మంజూరైన పాత బాలిక సంరక్షణ పథకం వాస్తవమేనని తేలడంతో కలెక్టర్‌ ఆమోదంతో రద్దు చేసినట్లు చెప్పారు.

న్యాయం చేయాలని లోక్‌సత్తా విజ్ఞప్తి

ఆమరణ దీక్షకు పూనుకున్న దేశరాజ్‌పల్లికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి దంపతులకు న్యాయం చేయాలని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ కోరింది. ఈమేరకు శుక్రవారం స్థానికంగా ఓ ప్రకటన విడుదలచేసింది.