దిగ్గజ కంపెనీ తొలి సీఎఫ్‌వోగా దివ్య రికార్డు
భారత మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాకు చెందిన అతిపెద్ద కార్ల కంపెనీ జనరల్ మోటార్స్ (GM)కు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ( CFO )గా ఇండియాకు చెందిన (భారత సంతతి) దివ్య సూర్యదేవర నియమితులయ్యారు. ప్రస్తుతం ఈమె GM లో కార్పొరేట్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కంపెనీ ప్రస్తుత CFO చుక్ స్టీవెన్స్ స్థానంలో దివ్య నియమితులయ్యారు. 39 ఏళ్ల వయసున్న దివ్యా చెన్నైలో జన్మించారు.
యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి కామర్స్‌లో బ్యాచులర్, మాస్టర్స్ డిగ్రీలు అందుకున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో MBA చదివేందుకు 22 ఏళ్ల వయసులో అమెరికాకు వెళ్లారు. చార్టర్డ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్, అకౌంటెంట్ అయిన దివ్య UBS , ప్రైస్ వాటర్ హౌజ్ కూపర్స్ లో పని చేశారు. ఆ తర్వాత డెట్రాయిట్ కేంద్రంగా ఉన్న జనరల్ మోటార్స్ 2005లో చేరారు. అప్పుడామె వయసు 25 ఏళ్లు. GMలో దివ్య కీలక బాధ్యతలు నిర్వహించి మంచి అనుభవం సంపాదించుకున్నారని, సంస్థ మంచి వ్యాపార ఫలితాలు సాధించడానికి కృషి చేశారని తెలిపింది యాజమాన్యం.
2018- సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఈమె నూతన బాధ్యతలు చేపడతారు. ఈ కంపెనీలోని కీలక బాధ్యతలు ఇద్దరు మహిళల చేతుల్లో ఉండటం విశేషం. ఇప్పటికే కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా మేరీ బర్రా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమెకే దివ్య రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆటో పరిశ్రమలో ఇద్దరు మహిళలు కీలక స్థానాల్లో ఉండటం ఇదే మొదటిసారి. ఏ గ్లోబల్ ఆటో కంపెనీలోనూ మహిళా CEO గానీ, CFO గానీ లేరు. ఎస్ అండ్ పి 500 కంపెనీల్లో హెర్షే కో, అమెరికన్ వాటర్ వర్క్స్ కోవంటి సంస్థల్లో మహిళలుCEO , CFO గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడీ కంపెనీల సరసన GM చేరుతుంది.