దిన దిన గండంగా కాలం వెళ్లదీస్తున్న సర్కారు పాఠశాలలు*
జనంసాక్షి జూలై23 పెద్దేముల్
శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో భయం భయంగా చదువులు కొనసాగుతున్నాయి. పెద్దేముల్ మండలంలోని మదనంతాపూర్ పాఠశాల గదులలోకి తేమ రావడంతో పాటు పెచ్చులు ఊడి ఎప్పుడు కూలుతుందో అనే భయంతో ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు.ఇలాంటి భవనాలలో తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు విద్యార్థుల తల్లి తండ్రులు జంకుతున్నారు.. నూతన పాఠశాల నిర్మాణం నిధుల కొరతతో మధ్యలోనే ఆగిపోయింది.పాత పాఠశాలలో ప్రమాదం జరిగితే బాధ్యులెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పాఠశాలలో మొత్తం 36 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్ నారు.
చాలా ఏళ్ళ క్రితం నిర్మించిన పాఠశాలలు శిథిలావస్థకు చేరుకోగా,నూతన పాఠశాల భవన నిర్మాణం మధ్యలోనే నిధుల కొరతతో నిలిచిపోవడంతో ప్రస్తుతం కమ్యూనిటీ హాలులో విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రస్తుతం వానా కాలం కావడంతో వర్షం పడితే పాఠశాల భవనం గోడలు తేమ కావడంతో ఎప్పుడు ఏ అపాయం జరగుతోందో అని విద్యార్థులతో పాటు వారి తల్లి తండ్రులకు భయం పట్టుకుంది.ప్రమాదాల మధ్య భయకరమైన వాతావరణంలో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే సాహసం చేయలేక ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్నారు.కనీసం ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మదనంతాపూర్ నూతన పాఠశాలను నిర్మాణం పూర్తి చేయాలని గ్రామ సర్పంచ్ గోవర్ధన్, విద్యార్థుల తల్లి తండ్రులు కోరుతున్నారు.