దీపా కర్మాకర్‌ స్ఫూర్తిగా క్రీడారంగాన్ని పటిష్టం చేసుకోవాలి

క్రీడలంటే క్రికెట్‌, చదువంటే ఎంఎస్‌, సంపాదనంటే డాలర్‌,గమ్యం అమెరికా అన్న చందంగా  ఇప్పుడు భారీతీయ యువత గమ్యం మారింది. ప్రతి ఒక్కరూ బిటెక్‌ చదివి అమెరికా వెళ్లాలని డాలర్‌ కలలు కంటున్నారు. అక్కడేమో ఉద్యోగాలు లేక ఉన్నవారిని వెనక్కి పంపిస్తున్నారు. ఇకపోతే ఆటలంటే క్రికెట్‌ అన్న చందంగా తయారయ్యింది. కేవలం ఓ పదిమందికి మాత్రమే అవకాశం ఉన్నా వేలాదిమంది ఇందుకోసం సాధన చేస్తున్నారు. విస్తృత అవకాశాలు ఉన్న అనేక క్రీడలను పక్కదారి పట్టించారు. ప్రభుత్వాలు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, సరైన మార్గం నిర్దేశించక పోవడంతో ఎవరికి వారు తమకు తోచిన విధంగా ఆర్థిక స్థోమతను బట్టి క్రీడల్లో తలదూరుస్తున్నారు. ఈ దేశంలో కోట్లాది యువత ఆశలు తీర్చేలా కనీసం క్రీడాకారులను తీర్చిదిద్ది దేశ గౌరవాన్ని ఇనుమడించేలా చేయలేకపోతున్నారు. గ్రామాల్లో కబడ్డీ, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, చదరంగం తదితర క్రీడలకు ప్రోత్సాహం కరువయ్యింది. ఈ సంధి దశలో జిమ్నాస్టిక్‌ క్రీడాకరిణి దీపాకర్మాకర్‌ తళుక్కున మెరిసి ఈ రంగంలో భారత్‌ పరువు నిలిపింది. నిజానికి జిమ్నాస్ట్‌లో చైనా, రష్యా తదితర దేశాలతో పాటు అనేక చిన్నిచన్న దేశాలు కూడా ముందున్నాయి. ఆయా దేశాలు క్రీడలను ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్నాయి. మన దౌర్భాగ్యం ఏమో కానీ క్రీడల వరకు వచ్చే సరికి నిధులు విదిల్చడానికి వెనకాడుతారు. త్రిపుర క్రీడా సంచలనం దీపా కర్మాకర్‌ పేరిప్పుడు దేశమంతా మారుమోగుతోందంటే ఆమె చూపిన పట్టుదల, ప్రతిభా పాటవాలే కారణం. నూట ఇరవై ఏళ్ల ఒలింపిక్స్‌ చరిత్రలో జిమ్నాస్టిక్స్‌ విభాగంలో అడుగిడుతున్న తొలి భారత మహిళా క్రీడాకారిణిగా ఆమె సృష్టించిన చరిత్ర స్ఫూర్తిదాయకం! పతకం సంగతి అలా ఉంచితే ఐదు దశాబ్దాలుగా ఈ విభాగంలో పురుషులు కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించలేక పోవడం దీపా కర్మాకర్‌ సాధించిన ఘనతకు నిదర్శనంగా చెప్పుకోక తప్పదు.

ప్రధాని మోడీ సైతం దీప ప్రతిభను పొగడకుండా ఉండలేకపోయారు. అంటే ప్రోత్సాహం ఉంటే ఏ రంగంలో అయినా రాణించడానికి మనవారు సిద్దంగా ఉన్నారని దీప తన ప్రతిభ ద్వారా నిరూపించారు. అందుకు ఆమె సదా అభినందనీయురాలు.  జిమ్నాస్టిక్స్‌ విభాగంలో భారత్‌ తరఫున తొలి మహిళగా, ఐదు దశాబ్దాల తరువాత దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారిణిగా ఆమె పేరు భారత క్రీడా చరిత్రలో శాశ్వతం కానుంది. ఈ ఘనతేవిూ ఒక్క రోజులో సునాయసంగా వచ్చింది కాదు. ఎన్నో కష్ట నష్టాలను, శారీరక శ్రమను ఓర్చి అకుంఠిత దీక్షతో చేసిన సాధన ఫలితమిది! అందుకు ఆమెతనకుతానుగా సాధించిన ఘనతగానే దీనిని గుర్తించాలి. నిజానికి ఆమె ప్రతిభను గుర్తించి ప్రభుత్వమే ఇందుకు నిధులు వెచ్చించి శిక్షణ ఇచ్చివుంటే ఎదంరికో ప్రురణగా ఉండేది. కానీ ఆమె అర్హత సాధించిన తరవాత పొగడ్తలతో ప్రధాని మోడీ చేతులు దులుపుకున్నారు. స్వతహాగా వెయిట్‌లిఫ్టర్‌ అయిన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం, గురువు విశ్వేశ్వర్‌ నంది మార్గదర్శకత్వంలో ఆమె ఈ ఘనత సాధించారు.  తండ్రి ఆశయాన్నే లక్ష్యంగా చేసుకుని, ఆకాశమే హద్దుగా ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగింది. జిమ్నాస్టిక్స్‌లోనూ అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే ‘ప్రొదునోవా’ విన్యాసంలో దీప రాణిస్తున్న తీరు నిజంగా అద్భుతం కాక మరోటి కాదు. కానీ అలాంటి ప్రోత్సాహం ప్రభుత్వ పరంగా దక్కివుంటే పరిస్తితి మరోలా ఉండేది. ఇంకెందరికో ప్రేరణగా ఉండేది. పేరొందిన జిమ్నాసిస్ట్‌లు సైతం ఈ విన్యాసం ప్రదర్శించడానికి వెనుకంజ వేయడానికి కారణం దానిలో పొంచి ఉన్న ప్రమాదమే! ఏ మాత్రం తడబడినా, అడుగు పొరపాటు పడినా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉండటమే దీనికి కారణం. అంత ప్రమాదకరమైనది కాబట్టే అంతర్జాతీయ పోటీల్లో ఈ విన్యాసాన్ని విజయవంతంగా ప్రదర్శించిన వారి సంఖ్య ఇప్పటికి ఐదుగురికే పరిమితమైంది.

ఆ ఐదుగురిలో దీప ఒకరు కావడం భారత్‌కు పతకంపై ఆశలు రేకిత్తిస్తోంది. 2014 కామన్వెల్త్‌, గతేడాది ఆసియా క్రీడల్లో సత్తా చాటిన దీప విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్‌లోనూ రాణించి దేశ ప్రతిష్టను ఇనుమడింపచేస్తుందని ఆశిద్దాం. దీప కూడా ఇప్పటికే ఆ దిశలో సంకల్పాన్ని ప్రకటించడం హర్షణీయం. వెనుకబడిన, ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర ముఖచిత్రం క్రీడలతో మారుతుందని దీప నిరూపించింది.  మహిళా అక్షరాస్యతలో దేశంలో శాంతి వెల్లివిరుస్తుందని నమ్ముతున్న తరుణంలో క్రీడలుకూడా అందుకు దోహదపడతాయని ప్రబుత్వం గుర్తించాలి. సువిశాల భారత దేశంలో ఈ స్థాయి ప్రతిభా పాటవాలు అంతంత మాత్రంగానే వెలుగులోకి వస్తున్నాయి. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో క్రీడా యవనికపై అప్పుడప్పుడు మెరిసే మెరుపులకే మురిసి పోవాల్సి రావడం బాధాకరం. దేశ యువతలో ప్రతిభను వెలికితీయకపోవడం వల్ల ఎవరు కూడా ముందుకు రావడం లేదు. మరిన్ని దీపాలను వెలగించాలంటే కేంద్రం సమగ్ర క్రీడా విధానంతో ముందుకు సాగాలి.  మట్టిలోని మాణిక్యాలను వెదికి పట్టుకుని వారికి మెరుగులు దిద్ది, అవసరమైన హంగులు కల్పించి ప్రోత్సహించే విధానం అవలంబించాలి.   జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు సైతం గుర్తింపు లేకుండా పోవడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వం క్రీడలకు ఇచ్చిన బడ్జెట్‌ కేటాయింపులపై పెదవి విరుపులు వ్యక్తమవుతున్న తరుణంలో దీపను స్ఫూర్తిగా తీసుకుని ఈ రంగాన్ని ప్రోత్సహించేలా పెట్టుబడులు పెంచాలి.