దుబ్బాకలో ప్రజలను భయపెడుతున్నారు

ఓటేయకుంటే పథకాలు ఊడుతాయని బెదరింపులు
కరీంనగర్‌లో సంజయ్‌ను పరామర్శించిన డికె అరుణ
ప్రధాని కళ్లు తెరిస్తే కెసిఆర్‌ జైలుకే అన్న బాబూ మోహన్‌
కరీంనగర్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): కరీంనగర్‌లో బండి సంజయ్‌ దీక్షతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన స్వీయనిర్బంధంలోకి వెళ్లడంతో బిజెపి నేతలు పరామర్శించారు. వివిద జిల్లాల నుంచినేతలు వచ్చి పరామర్శించారు. మాజీమంత్రులు డికె అరుణ, బాబూ మోమన్‌ తదితరులు పరామర్శించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి పాలు కాబోతోందని  జోస్యం చెప్పారు. ఈ విషయం సర్వేల్లో తేలడంతోనే ఆ పార్టీ అరచకాలు చేసి గెలవాలనుకుంటోందని ధ్వజమెత్తారు. పోలీసులను అడ్డుపెట్టుకుని టీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల కోడ్‌ లేని సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థుల బంధువుల ఇళ్లలో అప్రజాస్వామికంగా సోదాలు చేశారన్నారు. దుబ్బాకలో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ సొంత సీటును కాపాడుకునేందుకు దురాగతాలు చేస్తోందని ధ్వజమెత్తారు. అక్కడ ప్రజలు టీఆర్‌ఎస్‌ కు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఇవ్వబోమని దుబ్బాక ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఓడిపోతామని తెలిసి సీఎం మైండ్‌ గేమ్‌ ఆడుతున్నాడన్నారు. దుబ్బాక ఫలితం రానున్న 2023 ఎన్నికల ఫలితాలకు అద్దం పట్టబోతోందన్నారు. ఎందుకోసం తెలంగాణ కోరుకున్నామో అవేవీ నెరవేరలేదన్నారు. టీఆర్‌ఎస్‌ నియంతృత్వ పోకడను ప్రజలు అర్థం చేసుకున్నారని అరుణ అన్నారు. దుబ్బాకలో కనీస అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం నుంచి డబ్బులు రాలేదని, వ్యవసాయ విూటర్లు పెడుతారని హరీశ్‌ అబద్దాలు చెబుతున్నాడని మండిపడ్డారు. కేంద్ర నిధులు రాలేదని అర్థిక మంత్రి రాతపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ కంటే హరీష్‌ ఎక్కువ అబద్దాలు చెబుతున్నాడన్నారు. అబద్దాల్లో వీళ్లకు డాక్టరేట్‌ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.  ప్రధాని ఒక్కసారి కన్నెర్ర జేస్తే విూరు జైల్లో ఉంటారనే విషయం గుర్తుంచుకోవాలని బీజేపీ నాయకుడు, సినీ నటుడు బాబు మోహన్‌ హెచ్చరించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో మంత్రి హరీష్‌ రావు తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పై పోలీసులను ఉసిగొల్పి దాడి చేయించాడని ఇది చాలా హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. హరీశ్‌ రావు చిన్న పిల్లాడిలాగా ప్రస్టేషన్‌ తో మాట్లాడుతున్నాడన్నారు. దుబ్బాకలో ఓటమి భయంతోనే ఇలాంటి అలజడులు రేపుతున్నారని ఆరోపించారు.  ఆడవాళ్లు, పిల్లలని చూడకుండా పోలీసులు అతిగా ప్రవర్తించారు.. హుందాగా ఉండాల్సిన సీపీ అత్యుత్సాహం చూపించారు. సిద్దిపేటలో సోమవారం జరిగిన  ఘటనపై చర్యలు తప్పవు. ఇలాంటి పరిస్థితి విూకు ఎదురవుతుందన్నారు. సిద్ధిపేట, గజ్వేలులాగా దుబ్బాక ఎందుకు అభివృద్ధి చేయలేదు? అని ప్రశ్నించారు. రఘునందన్‌ రావు గెలిస్తే దుబ్బాక అభివృద్ధి ఖాయం అని జోస్యం చెప్పారు. అధికారం ఉందని ఇలాగే చేస్తే  ప్రధాని కన్నెర్రజేస్తే విూరు జైల్లో ఉంటారని గుర్తుంచుకోవాలని.. దుబ్బాక ఫలితంతో  విూ పునాదులు కదలబోతున్నాయని బాబు మోహన్‌ హెచ్చరించారు.