దుర్గగుడిలో సామూహిక అక్షరాభ్యాసాలు
విజయవాడ, జూన్22(జనం సాక్షి ) : విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం శుక్రవారం వైభవంగా జరిగింది. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావటంతో దుర్గమ్మను సరస్వతిదేవి రూపంలో అలంకరించారు. అలాగే ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వందలాది మంది భక్తులు హాజరయ్యారు. వేద పండితుల ఆధ్వర్యంలో చిన్నారులకు ఓనమాలు దిద్దారు. మల్లిఖార్జున మహామండపంలో ఈ కార్యక్రమం జరిగింది. అక్కడ కూడా ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహాన్ని సరస్వతిదేవి రూపంలో అలంకరించి ఆమె సన్నిధిలో చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. ప్రతి నెలా మూల నక్షత్రం రోజున దుర్గగుడిలో సరస్వతి పూజ నిర్వహించటం ఆనవాయితీ. అలాగే విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో ఉచితంగా సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించే సంప్రదాయం కూడా ఉంది. అదే కోవలో ఇవాళ నిర్వహించిన అక్షరాభ్యాసంలో వందలాది మంచి పిల్లలు అక్షరాలు దిద్దుకున్నారు. పిల్లలకు పలకా బలపంతో పాటు స్కూల్ బ్యాగ్, అమ్మవారి ప్రసాదాలు ఉచితంగా అందజేశారు. అలాగే అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించారు. సామూహిక అక్షరాభ్యాసంలో సుమారు 500 మంది చిన్నారులు పాల్గొన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.