దూసుకెళ్తున్న ఇంగ్లండ్

india-england-test-matchతొలి టెస్టులో విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టుకు ఇంగ్లండ్ జట్టు కొరకరాని కొయ్యగా తయారైంది. భారత బౌలర్లు ఎంత శ్రమిస్తున్నా ఇంగ్లండ్ క్రికెటర్లు మాత్రం తమ ఆధిపత్యాన్ని ఎటువంటి తడబాటు లేకుండా కొనసాగిస్తున్నారు. బుధవారం తొలి రోజు జో రూట్-మొయిన్ అలీ జోడి నాల్గో వికెట్ కు 179 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయగా, ఈ రోజు ఆటలో బెయిర్ స్టో-బెన్ స్టోక్స్ జంట 99 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసింది. అయితే సెంచరీ భాగస్వామ్యానికి పరుగు దూరంలో ఉండగా బెయిర్ స్టో ఆరో వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం బెయిర్ స్టో-బెన్ స్టోక్స్లు వన్డే తరహాలో బ్యాట్ ను ఝుళిపించారు. ఈ క్రమంలోనే బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీ సాధించగా, బెయిర్ స్టో(46;57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థ శతకాన్ని తృటిలో కోల్పోయాడు. అంతకుముందు 311/4 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు మొయిన్ అలీ(117)ను ఐదో వికెట్ గా కోల్పోయింది. ఇంకా బెన్ స్టోక్స్ క్రీజ్ లో ఉండటంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది.  రెండో రోజు లంచ్ సమయానికి ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 450 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.