దేవాదాయ శాఖలో బదిలీల బాగోతం

ఒకే గుడికి ఇద్దరు ఇవోల బదిలీ
కర్నూలు,జూలై 19(జ‌నంసాక్షి): ఇటీవల సాధారణ బదీలీలు దేవదాయ శాఖలో గందరగోళంగా తయారయ్యాయి. ఒక ఆలయం ఈవో పోస్టుకు ఇద్దరు బదిలీపై వచ్చారు. కడప జిల్లా నుంచి నలుగురు, చిత్తూరు జిల్లా నుంచి ఒకరిని అదనంగా జిల్లాకు బదీలీపై పంపారు. పోస్టులు ఖాళీ లేక పోయినా అదనంగా జిల్లాకు పంపించారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక దేవదాయశాఖాధికారులు తల పట్టుకుంటున్నారు. గడివేముల మండలంలోని దుర్గా భోగేశ్వరాలయం ఈ వో పోస్టుకు ఇద్దరు ఈవోలకు బదిలీ చేశారు. కడప జిల్లా నుంచి చంద్రశేఖరరెడ్డి, నంద్యాల-గిద్దలూరు రహదారి అటవీ పరిధిలోని నల్లమల నరసింహస్వామి ఆలయ ఈవోగా పనిచేస్తున్న జనార్దన్‌కు కూడా అదే అలయానికి పోస్టింగ్‌ ఇచ్చారు. ఏం చేయాలో అర్ధం కాక ఇద్దరూ బాధ్యతలు తీసుకోకుండా వేచి ఉండమని అసిస్టెంట్‌ కమిషనర్‌ మౌఖికంగా ఆదేశించారు. అయితే తాను ఆ పోస్టులో బాధ్యతలు తీసుకుంటానని ఇద్దరూ అసిస్టెంట్‌ కమిషనర్‌ వద్ద పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఓ మంత్రి ఆశీస్సులతో ఇక్కడిక వచ్చిన ఈవో తానే బాధ్యతలు తీసుకుంటానని అధికారులపై ఒత్తిడి కూడా తెస్తున్నట్లు సమాచారం. వీరికి తోడు కడప జిల్లా నుంచి మద్దిలేటి, రాధాక్రిష్ణ, వెంకటసుబ్బయ్య, చిత్తూరు జిల్లా నుంచి హనుమంతరావును జిల్లాకు బదిలీ చేశారు. అయితే కడప, చిత్తూరు జిల్లాల నుంచి ఐదుగురు జిల్లాకు బదిలీ అయ్యారు. వారికి ఎక్కడ పోస్టులు చూపాలో తెలియక జిల్లా అధికారులు తలపట్టుకుంటున్నారు. గత ప్రభుత్వ హయంలో ఈవో రాధాక్రిష్ణపై ఫిర్యాదులు రావడంతో మార్చిలో కడపజిల్లా బద్వేలుకు బదిలీ చేశారు. సాధారణ బదిలీల్లో జిల్లాకు ఆయన రిలీవింగ్‌ ఆర్డర్‌తో వచ్చారు. అయితే జిల్లా ఉన్నతాధికారులు ఆయన ఉత్తర్వులను తిరస్కరించి పంపారు. ఆయన బదిలీని తిరస్కరించినప్పటికి మరో నలుగురు ఈవోలు అదనంగా జిల్లాకు వచ్చారు. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు కోసం అధికారులు వేచి చూస్తున్నారు.