దేవుడి స్క్రిప్ట్‌ రివర్స్‌

వైనాట్‌ 175కు దిమ్మతిరిగే సమాధానం
ఒక్క ఛాన్స్‌ సిఎం జగన్‌కు ప్రజల రిటర్న్‌ గిఫ్ట్‌
అమరావతి,జూన్‌4 (జనంసాక్షి) : వైనాట్‌ 175 అన్న జగన్‌కు ప్రజలు గట్టి దెబ్బ కొట్టారు. కేవలం 15 సీట్లకే పరిమితం చేసేలా ఉన్నారు. ప్రతిపక్షహోదా కూడా దక్కకుండా చేశారు. ఒక్క ఛాన్స్‌ అంటూ గద్దెనెక్కి ప్రజావేదిక కూల్చివేతతో చేపట్టిన విధ్వంసం..ఐదేళ్లలో అంతాఇంతా కాదు. జగన్‌ మాటల్లో చెప్పాలంటే…
అవును.. అక్షరాలా దేవుడి స్క్రిప్టే..! ఏపీ ఎన్నికల ఫలితాలతో సీన్‌ మొత్తం రివర్స్‌ అయిపోయింది..! 2019 ఎన్నికల్లో 23 సీట్లకే టీడీపీ పరిమితం కావడంతో.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా హేళన చేసిందో.. ఎంతలా కించపరుస్తూ మాట్లాడిరదో అందరికీ గుర్తుండే ఉంటుంది..! తనను ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒక్క మంచి పనయినా చేశాడా అని నిలదీశారు. నేరుగా డబ్బులు వేయడమే పాలన అనుకున్నాడు. అంతేకాదు.. ఆ 23లోనూ కొంతమందిని వైసీపీ లాగేసుకోగా మిగిలింది 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. అయినా సరే ఎక్కడా అదరక బెదరక ఒంటరిగానే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒంటరిగానే పోరాటం చేశారు. ఇక ఎన్నికల ముందు బీజేపీ, జనసేన పార్టీలతో కూటమిగట్టిన టీడీపీ.. ఊహించని రీతిలో సీట్లు దక్కించుకున్న దంటే మామూలు విషయం కాదు. అది కూడా టీడీపీ నంబర్‌ వైసీపీకి రావడం అంటే దేవుడి స్క్రిప్ట్‌ అంటే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా సీట్ల రూపంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి బాగానే తెలిసొచ్చినట్లుంది. వైనాట్‌ 175 అనే
ట్రిబుల్‌ డిజిట్‌ నుంచి డబుల్‌ డిజిట్‌కు అది కూడా 20 లోపే సీట్లకు పరిమితం అయ్యే పరిస్థితి అంటే విధి ఎంత విచిత్రమో కదా..! అది కూడా టీడీపీతో కాదు జనసేనతో పోటీ పడి గెలవబోతోందంటే ఎక్కడ్నుంచి పరిస్థితి ఇంకెక్కడికి పడిపోయిందో కదా!. వైఎస్‌ జగన్‌ ఎప్పుడూ పైనున్న దేవుడు, ప్రజల ఆశీస్సులే గెలిపిస్తాయని అంటూ ఉంటారు కదా.. ఉన్నాయి కానీ కూటమికే ఇవన్నీ..! బహుశా వైసీపీకి ఈ పరిస్థితి వస్తుందని కలలో కూడా కార్యకర్తలు, పార్టీ నేతలు ఊహించి ఉండరేమో మరి. అందుకే అధికారం వచ్చిందని ఎగిరెగిరి పడితే పరిస్థితి ఎలా ఉంటుంది..? అభివృద్ధి పక్కనెట్టి బటన్‌ నొక్కుడే పనిగా పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని వైసీపీ అధినేతకు బాగా తెలిసొచ్చిందేమో!. ఎక్కడైతే.. అదేనబ్బా బహిరంగ సభలు, సమావేశాలు.. అసెంబ్లీలో వైఎస్‌ జగన్‌ అండ్‌ కో 23.. 23 అని హేళన చేశారో.. ఇప్పుడు అవే వేదికగా టీడీపీ మోతెక్కిస్తుందేమో..! ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదేమో. ఇప్పటికే సోషల్‌ విూడియా వేదికగా రచ్చ రచ్చ నడుస్తుండగా.. ఇప్పుడిక తెలుగు తమ్ముళ్లు థాటి నుంచి వైఎస్‌ జగన్‌ ఎలా తట్టుకుంటారో.. ఎదుర్కొంటారో అని వైసీపీ శ్రేణులు కంగారు పడుతున్న పరిస్థితి. ఇవన్నీ కాదు.. వైఎస్‌ జగన్‌ నుంచి రియాక్షన్‌ ఎలా ఉంటుందా అని.. టీడీపీ కంటే ఎక్కువగా వైసీపీ శ్రేణులు ఎదురుచూస్తున్న పరిస్థితి. ఘోరాతి ఘోర ఓటమిపై ఏం మాట్లాడుతారో వేచి చూడాలి మరి.